అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..
1 min readమల్లికార్జున రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎఫెక్ట్..
పల్లెవెలుగు మిడుతూరు (నందికొట్కూరు): అప్పుల బాధలు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో చోటుచేసుకుంది.మిడుతూరు ఎస్ఐ ఎం జగన్మోహన్ తెలిపిన వివరాల మేరకు దేవనూరు గ్రామానికి చెందిన పింజరి మహమ్మద్ రఫీ(38) గురువారం ఉ.6 గంటలకు వారి బాత్ రూమ్ లో పురుగుల మందు తాగాడు.తర్వాత ఇంటి దగ్గర వాంతులు చేసుకుంటుండగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. మధ్యలోనే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారని అన్నారు. మృతుని కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మృతునికి రెండు ఎకరాల సొంత పొలం ఉందని పంటలు దిగుబడి రాకపోవడంతో 15 లక్షల దాకా అప్పులు ఉన్నాయని అంతే కాకుండా ఇక్కడి గ్రామాల్లో మల్లికార్జున రిజర్వాయర్ ప్రాజెక్టు వస్తుందని గ్రామాలు పోతాయనే ఉద్దేశంతో గ్రామాల్లో పొలాలను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఈ ప్రాజెక్టు గురించి గ్రామాల్లో ప్రజలకు అధికారులు వివరంగా తెలియజేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతునికి భార్య మౌలాబీ, కూతుర్లు హసీనా(12),మెహరాజ్(8), కుమారుడు చాంద్ బాష(3) ఉన్నారు.కుటుంబ యజమాని మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తండ్రి నూర్ భాష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.