PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పరిశ్రమల అభివృద్ధి… విస్తరణకు తొలి ప్రాధాన్యత

1 min read

పారిశ్రామికాభివృద్ధి ఆకాంక్షించే ఫ్రెండ్లీ ప్రభుత్వం మాది 

రాష్ట్ర సమాచార,గృహా నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారధి

పరిశ్రమలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా సమావేశం ఏర్పాటుచేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను అభినందించిన మంత్రి

తమ సమస్యల పరిష్కారానికి  సమావేశం నిర్వహణపై హర్షం వ్యక్తం చేసిన పలువురు  పారిశ్రామికవేత్తలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :  రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం స్నేహపూరిత వాతావరణంలో చేయూత అందిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో గురువారం    జిల్లా స్థాయి పారిశ్రామిక, పర్యావరణ, కార్మిక భద్రతలపై ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశం ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది.  సమావేశంలో మంత్రి పార్థసారథి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ   రాష్ట్రంలో వ్యవసాయరంగంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పధంలో పయనిస్తుందన్నారు.  ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, పరిశ్రమల అభివృద్ధి, విస్తరణకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.  గత ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాల కారణంగా  రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని, అటువంటి వాతావరణాన్ని సరిదిద్ది, పారిశ్రామికవేత్తల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే   దిశగా సమావేశంను నిర్వహించడం జరిగిందన్నారు.  ఇందుకు కృషిచేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహెష్ ను మంత్రి అభినందించారు. సమావేశంలో పారిశ్రామికవేత్తలు తెలియజేసిన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  పరిశ్రమల శాఖ మంత్రి  పరిష్కరించే దిశగా కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు అనువైన వాతావరణం ఉండడంతో దేశ ,రాష్ట్రవ్యాప్తంగా పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు క్యూ కడుతున్నారని, ఇది రాష్ట్రాభివృద్ధికి శుభపరిణామన్నారు. సమావేశంలో పారిశ్రామికవేత్తలు తెలియజేసిన సమస్యలకు పరిష్కార మార్గం చూపే దిశగా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సూచించారు.  ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ఎంతోమంది పారిశ్రామికవేత్తలు తమ సమస్యలు పరిష్కరించవలసిందిగా తనను కలిసి కోరారని,  జిల్లాలో గత 5 సంవత్సరాల కాలంలో పారిశ్రామికవేత్తల సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని  అయితే తాము కొత్త పరిశ్రమల ఏర్పాటు, విస్తరణకు అవసరమైన విషయాలు తెలుసుకునేందుకు, పారిశ్రామికవేత్తలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా  ఏర్పాటుచేసిన తొలి సమావేశమన్నారు.  జిల్లాలో పారిశ్రామికవేత్తల సమస్యలను పరిష్కరించడం ద్వారా కొత్త పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు.  పరిశ్రమలు స్థాపించే వారికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని, ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో జిల్లాలో మరిన్ని పరిశ్రమ ఏర్పాటుతో పాటు  ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు విస్తరణకు వీలు కలుగుతుందన్నారు.  కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు, పరిశ్రమల విస్తరణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ నిబంధనల ననుసరించి నూరు శాతం అన్నివిధాలా సహకరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్  మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి తొలి అడుగు పడిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక యువత ఉద్యోగ అవకాశాలు కోసం  ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారని, అటువంటి పరిస్థితిని మార్చి మన రాష్ట్రంలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెద్దఎత్తున పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు.  ఇది శుభపరిణామమన్నారు. మన రాష్ట్రం నుండి 64 వేల  కోట్ల రూపాయల విలువైన ఆక్వా ఉత్పత్తులు  ఎగుమతులు జరుగుతున్నయన్నారు.  కార్పొరేట్  సామజిక బాధ్యత లో భాగంగా పారిశ్రామికవేత్తలు నిర్దేశించిన మేరకు ప్రజలకు అవసరమైన త్రాగునీరు, రోడ్ల అభివృద్ధి, తదితర సామజిక సేవలకు సహకరించాలన్నారు.   చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పరిశ్రమల పరిసరాలలో రోడ్లు, తదితర మౌలిక సదుపాయాల కల్పనకు  ప్రభుత్వ,ప్రైవేట్ భాగస్వామ్యంలో పనులు చేపట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం వెనుకబడిన గిరిజన ప్రాంతమని, తమ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి గిరిజన ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. సమావేశంలో పలు పారిశ్రామికవేత్తలు తమ సమస్యలను తెలియజేసారు. భీమడోలు సమీపంలోని అంబార్ పేట లోని    లిక్సిల్ ఇండియా సానిటరీ వేర్ కంపెనీ  ప్రతినిధి లోకేష్ మాట్లాడుతూ తమ పరిశ్రమకు వచ్చే దారిలో రోడ్లు అద్వాన్న పరిస్థితిలో ఉన్నాయన్నారు. తమ పరిశ్రమను మరింత విస్తరించే  ఆలోచనలో యాజమాన్యం ఉన్నందున, రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటే తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఉచిత ఇసుక విధానాన్ని స్వాగతిస్తున్నామని, తమ పరిశ్రమకు కావలసిన ముడిసరుకు ఐన  ‘సిలికాన్ సాండ్’ కొరత ఉందని, ఈ సమస్య పరిష్కరించేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. స్థానిక ఐ.టి.ఐ లో సిరామిక్ పరిశ్రమకు సంబంధించి ప్రత్యేక కోర్స్ ను ప్రవేశపెడితే, స్థానికులకు తమ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలకు వీలు ఉంటుందన్నారు. గోద్రెజ్ ఆగ్రో వెట్ పరిశ్రమ ప్రతినిధి చౌదరి మరియు ఎస్.ఆర్. సీడ్స్ ప్రతినిధి వెంకటరావులతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు మాట్లాడుతూ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఆక్ట్ ప్రకారం వసూలు చేస్తున్న 1 శాతం  సెస్సు ను, కేవలం పరిశ్రమలో పూర్తి పెట్టుబడిపై కాకుండా, పరిశ్రమలో భవన నిర్మాణాల  పెట్టుబడి వరకే సెస్సును పరిమితం చేయాలనీ సూచించారు.  పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ ను నాణ్యతతో ఎటువంటి అంతరాయం లేకుండా  అందించాలని కోరారు.  తమ పరిశ్రమకు ప్రస్తుతం ఉన్న 4 మెగా వాట్ల ట్రాన్స్ఫార్మర్ ను 8 మెగా వాట్ల ట్రాన్సఫార్మగా మార్చాలని కోరారు. సమావేశంలో   శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), పత్సమట్ల ధర్మరాజు, డిఆర్ఓ డి. పుష్పమణి, ఆర్డీఓ లు ఎన్ .ఎస్.కె. ఖాజావలి , కె. అద్దయ్య , వై. భవానీశంకరి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్  వి. ఆదిశేషు, కాలుష్యనియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్  ఫ్యాక్టరీస్ ఆర్. త్రినాధరావు, కార్మిక శాఖ ఉప కమీషనర్ పి . శ్రీనివాస్,   ఏపిఐఐసి జోనల్ మేనేజర్ కె.బాబ్జి, ఉద్యానవనాలు శాఖ డిడి రామ్మోహన్, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, జిల్లాలోని వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు  పాల్గొన్నారు.

About Author