ఆర్యూలో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలి.. వైస్ ఛాన్సిలర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాల్సిందిగా విశ్వవిద్యాలయ వైస్ఆఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ ఆదేశించారు. ఈరోజు వి.సి కాన్ఫరెన్సుహాలులో వర్సిటీకి అనుబంధంగా ఉన్న పురుషుల మహిళల హాస్టల్ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో హాస్టళ్లకు సంబంధించిన పలు అంశాలను ఆయన సమీక్షించి పలు సూచనలు చేశారు. హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచుతూ నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. హాస్టల్ విధులు నిర్వహిస్తున్న వివిధ స్థాయిల ఉద్యోగులు తమకు నిర్దేశించిన సమయాల్లో తప్పనిసరిగా హాస్టళ్లను తనిఖీచేయాలన్నారు. వార్డెన్, డిప్యూటీవార్డెన్లు విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించేందుకు కృషిచేయాలన్నారు. తరగతులు జరిగే సమయాల్లో విద్యార్థులెవరూ హాస్టల్ గదుల్లో ఉండకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. పురుషుల మరియు మహిళల హాస్టళ్లవద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేయాలన్నారు. హాస్టళ్లలో ఎలాంటి అనవసర విషయాలు జరకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. వర్సిటీతోపాటు హాస్టళ్ల సమస్యలపై ప్రత్యేకదృష్టి సారించి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈదిశగా వర్సిటీ అధికారులు చేపడుతున్న చర్యలకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. విధుల్లో అలసత్వాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడు, చీఫ్ వార్డెన్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, డిప్యూటీ వార్డెన్లు, ఇంజినీరింగ్ విభాగ సిబ్బంది, హాస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు.