పేద రైతులకు ఉచితంగా ఎద్దుల పంపిణీ..
1 min readశ్రీనివాసులును అభినందించిన ఎస్ఐ
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నిరుపేద రైతులకు ఉచితంగా ఎద్దులను పంపిణీ చేయడం చాలా సంతోషకరమని మిడుతూరు ఎస్ఐ హెచ్.ఓబులేష్ అన్నారు.సోమవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామ పొలిమేరలో ఉన్న బిజనేములకు చెందిన శ్రీ కృష్ణ గోశాల తరఫు నుంచి ఆవుల శ్రీనివాసులు ఎద్దుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై ఓబులేష్ హాజరయ్యారు. మండలంలోని పేద రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడే 10 జతల ఎద్దులను ఎస్సై మరియు ఆవుల శ్రీనివాసులు, రోళ్లపాడు సర్పంచ్ పేరెడ్డి వెంకటరామిరెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు.గత నెల 15వ తేదీన పొదిలికి చెందిన వ్యక్తులు పొదిలి నుండి కేరళకు కబేలాలకు వెళ్తున్న పది జతల ఎద్దులను రక్షించి వారి నుండి ఆ ఎద్దులను శ్రీకృష్ణ గోశాలలో అప్పగించడం జరిగింది.ఈ ఎద్దులను మండలంలోని గ్రామాల పేద రైతులను గుర్తించి వారికి అందించడం జరిగిందని ఎద్దులు వ్యవసాయానికి రైతుకు ఉపయోగ పడతాయని రైతులకు ఉచితంగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని గోశాల నిర్వహకుడు ఆవుల శ్రీనివాసులు తెలిపారు. ఎద్దులను రైతులకు ఉచితంగా అందజేయడం పట్ల ఎస్సై శ్రీనివాసులును అభినందించారు.ఉచితంగా ఎద్దులను తీసుకున్న రైతులు వాటిని సాకలేని పక్షంలో తమకే అప్పగించాలని రైతులను కోరారు.ఉచితంగా ఎద్దులు ఇవ్వడం ద్వారా మాకు ఎంతో మేలు జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి,జలకనూరు గుర్రప్ప స్వామి దేవాలయం ప్రధాన పురోహితుడు కట్టా కిషోర్ శర్మ మరియు గ్రామపెద్దలు పాల్గొన్నారు.