PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లాల్​ కుంబార్​ చిన్నప్ప (ఎల్​.కె.చిన్నప్ప), ఎంఏ, ఎంఈడి,.

  • విద్యారంగ.. అభివృధే లక్ష్యం…విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే..ధ్యేయం..
  • కలుపుగోలుతనమే బలం.. నిర్మోహమాటమే …ఎదుగుదలకు నిచ్చెన…
  • విద్యార్థి విజయమే… తన విజయంగా భావించే మహోన్నత వ్యక్తి…
  • తప్పులను సరిదిద్దుతూ…విద్యార్థిని తీర్చిదిద్దడంలో నేర్పరి..
  • చదువుతోపాటు… జీవిత పాఠాలు నేర్పిన గురువు…
  • తల్లిదండ్రుల తరువాతి స్థానం… ఆయనదే..
  • విద్యార్థి ఆలోచన..క్రమశిక్షణ..ప్రవర్తనపై ప్రత్యేక దృష్టిసారించి.. సక్సెస్​ టీచర్​గా పేరొందిన మహోపాధ్యాయుడు
  • ఓర్పు..సహనం..పట్టుదల..ఏకాగ్రతతోపాటు లీడర్​ షిప్​ లక్షణాలు నేర్పించే మేజర్​ (ఎన్​.సి.సి)
  • చదివిన చోటే… ఉపాధ్యాయుడిగా రాణించిన నిత్య విద్యార్థి…
  • విద్యార్థుల జీవన వికాసానికి.. చుక్కానయ్యాడు…
  • విద్యారంగ.. ప్రగతికి… దిశా..నిర్ధేశకుడయ్యాడు…
  • ఎందరో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ​కు బాటలు వేసిన మార్గదర్శి
  • జీవితాంతం…విద్యార్థుల సేవలో తరించాలని ఆశిస్తోన్న… ప్రజాహితైషి…
  • విద్యార్థి లోకానికి ఆదర్శం… ఉపాధ్యాయులకు స్ఫూర్తి..
  • స్నేహశీలి.. నిగర్వి.. సెయింట్ ఆంథోనీ వారి ఉన్నత పాఠశాల (ఆర్​సీఎం) ప్రధానోపాధ్యాయుడు, మేజర్​ (ఎన్​.సి.సి.) లాల్​ కుంబార్​  చిన్నప్ప  (ఎల్.కె.చిన్నప్ప) విజయనేపథ్యమిది…

విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత.. ఉపాధ్యాయులదే… అని మనసా…వాచా… నమ్మిన ఓ ఉపాధ్యాయుడు… విద్యార్థుల గెలుపోటములలో కీలకపాత్ర పోషిస్తూ… తనదైన శైలిలో పాఠాలు నేర్పిస్తున్నాడు. మార్కులే ప్రామాణికం కాదని… క్రమశిక్షణ, ఏకాగ్రత, ప్రవర్తన … బంగారు భవిష్యత్​ కు బాటలు వేస్తాయని క్లుప్తంగా వివరిస్తూ… ఎందరికో మార్గదర్శిగా… మరెందరికో స్పూర్తిగా నిలిచారు. ఆయనే లాల్ కుంబార్​ చిన్నప్ప ( ఎల్.కె. చిన్నప్ప ). సెయింట్ ఆంథోనీ వారి ఉన్నత పాఠశాల (ఆర్.సీ.ఎం) లో ప్రధానోపాధ్యాయుడిగా… మేజర్​( ఎన్​.సి.సి)గా విధులు నిర్వర్తిస్తూ… ఎన్నో అవార్డులు.. ప్రశంసాపత్రాలు పొందారు. శిష్యులు వివిధ రంగాలలో రాణిస్తుంటే.. తన కష్టం వృధా కాలేదని సంతోషించే ఎల్​.కె.చిన్నప్ప… నమ్మిన సిద్ధాంతాలే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని సగర్వంగా చెప్పుకొచ్చారు.

లాల్​ కుంబార్​ చిన్నప్ప… అంటే పరిచయం లేని పేరు… కానీ ఎల్​.కె.చిన్నప్ప అంటే… ఉపాధ్యాయ సంఘం( ఎయిడెడ్​ అండ్​ ప్రైవేట్​  టీచర్స్​ గిల్డ్​ ( ఏపీ టీజీ) అసోసియేషన్​ ) లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తి. పోరాట పఠిమ… ఉద్యమ నేపథ్యం.. ఉక్కు సంకల్పం… కార్యసాధకుడుగా పేరుగాంచిన ఉపాధ్యాయుడు చిన్నప్ప.. జీవితంలో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కష్టాలను స్వాగతించాడు… విజయాలు అధిగమించాడు. అంచెలంచలుగా ఎదిగి… ఎందరికో మార్గదర్శిగా.. ఆదర్శంగా… స్ఫూర్తిగా నిలిచాడు. విద్యార్థి లోకానికి… ఫ్రెండ్లీ టీచర్​గా ప్రసిద్ధిగాంచాడు.

ఆదోని, పల్లెవెలుగు: “తాను అనుభవించిన కష్టం…పగవాడికి కూడా రాకూడదు..” అనే భావనతో ఎదిగి….ఒదిగిన ఎల్.కె. చిన్నప్ప… తన చిన్నప్పటి కష్టాలను గుర్తు చేసుకుంటే… ఇప్పటికీ కళ్లు నెమర్లుతాయి. చాలీచాలని డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తన తల్లిదండ్రులపై ఎప్పుడూ కోప్పడలేదు. తాను అనుభవించిన కష్టాలను స్మరించుకుంటూ.. కాలంపై నింద వేయలేదు. విద్యాభ్యాస సమయంలో చేయని పనంటూ లేదు… పుస్తకాలు కొన్నేందుకు డబ్బు లేక… 25 పైసలకు పొలాల్లో గడ్డి పీకడానికి వెళ్లిన ఆయన… జీవితంలో ఎదుర్కొనని కష్టమంటూ లేదు.. బేల్దారుగా.. పెయింటరుగా… జిన్నింగ్​ మిల్లులో కూలీగా…  ఇలా ఎన్నో పనులు చేశాడు. ఒక పూట తిని…మరోపాట ఉపవాసం ఉంటూ… చిరిగిన బట్టలతో బడికి వెళ్లే ఆయన… ఎదురొచ్చే ప్రతిఒక్కరినీ దేవుళ్లుగానే భావించాడు. ఆదుకునే ప్రతి చేయిని.. ఆశీర్వదించమని అడిగాడు. దైవబలం… సంకల్ప దీక్ష…ఆత్మవిశ్వాసంతో ఒక్కొక్క విజయాన్ని చవిచూశాడు. మహోపాధ్యాయుడిగా… మేజర్​ ( ఎన్​సీసీ), ఏయిడెడ్​ మరియు ప్రైవేట్​ టీచర్స్​ అసోసియేషన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎల్​.కె. చిన్నప్ప విజయ కేతనం ఎగరవేశాడు. జీవితంలో ‘ సక్సెస్​ టీచర్​ ’గా రాణించాడు.

స్వగతం :

  • పేరు: లాల్​ కుంబార్​ చిన్నప్ప (ఎల్.కె. చిన్నప్ప)
  • తల్లిదండ్రులు: ఎల్.కె.మరియమ్మ, ఎల్​.కె.దేవి సింగ్​
  • స్వస్థలం: శుక్రవారపేట, ఆదోని, కర్నూలు (జిల్లా)
  • పుట్టినతేదీ :01.07.1962

కుటుంబ నేపథ్యం: తినడానికి తిండి లేదు… కట్టుకోడానికి బట్టలు లేవు… కనీసం నివాసం ఉండేందుకు గూడు కూడా లేని కుటుంబాన జన్మించిన ఎల్​.కె. చిన్నప్ప ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. కష్టేఫలి… అని నమ్మిన తన తండ్రి ఎల్​.కె.దేవి సింగ్​ వ్యవసాయ కూలీ… కుమ్మరి (కుండలు తయారు చేయుట) పని చేసే వారు. ఆయన 1969లోనే చనిపోయారు.  తల్లి ఎల్.కె.మరియమ్మ ఇంటింటికి వెళ్లి ముసుర్లు( వంటసామగ్రి) కడుగుతూ.. వచ్చిన అరకొర సంపాదనతో జీవనం సాగించేవారు. తాను, తన తమ్ముడు బాలప్ప ను పోషించేందుకు అవస్థలు పడిన కుటుంబం వారిది.

కుటుంబం: 1988లో ఆదోని పట్టణం శుక్రవార పేటలోని ఆర్​సీఎం చర్చిలో వారికి  వివాహమైంది. తన జీవిత సహధర్మ చారిణి పేరు ఆరోగ్య మేరి. తాను గృహిణిగా ఉంటూ కుటుంబ కార్యకలాపాల్లో తనకు సహకరిస్తున్నారు. వారికి ముగ్గురు సంతానం. మొదటి కూతురు దివ్య జ్యోతి ,ఎంటెక్​,అల్లుడు ఐ.ప్రశాంత్​ కుమార్​ చౌదరి. వీరికి ఇద్దరు పిల్లలు. రెండవ కుమార్తె నవ్యకీర్తి, బిటెక్​, అల్లుడు మార్నేని శేఖర్​ చౌదరి. వీరికి ఒక కుమారుడు. మూడవ కూతురు రమ్య దీప్తి,  ఎంటెక్, అల్లుడు కార్యంపూడి జెస్సి. సాఫ్ట్ వేర్​ ఉద్యోగి.

విద్యాభ్యాసం:  కడు పేద కుటుంబాన జన్మించిన తాను… ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆదోనిలోని  ఎంసిబి స్కూల్​లో విద్యనభ్యసించగా… 6 నుంచి 10వ తరగతి వరకు  సెయింట్ ఆంథోనీ వారి ఉన్నత పాఠశాల (ఆర్​సీఎం)లో చదివారు. ఇంటర్​ నుంచి డిగ్రీ వరకు ఆదోని ఆర్ట్స్​ కాలేజీలో విద్యనభ్యసించారు. డిగ్రీని​ సెల్విస్టర్​ అనే ఫాదర్ చదివించారని, ఆయన రుణం జన్మలో తీర్చుకోలేనిదని చెప్పుకొస్తారు.

ప్రభుత్వోద్యోగ ప్రస్థానం: చదువు పూర్తి అయిన వెంటనే…1985లో  స్కూల్​ రికార్డు అసిస్టెంట్​గా ఉద్యోగం చేరారు. నాలుగేళ్లు ఉద్యోగం చేస్తుండగా ..1.08.1989లో సెకండరి గ్రేడ్​ టీచర్​గా పదోన్నతి పొందారు. 1997లో ఎన్​సీసీ అధికారిగా, 1998లో హిందీ పాఠశాల అసిస్టెంట్​గా విధులు నిర్వర్తించారు. 2006 నుంచి ప్రధానోపాధ్యాయుడిగా ఉంటూ…  సోషల్​, ఇంగ్లీష్​ సబ్జెక్టులు బోధించారు.

ఇష్టమైన గురువు:  సెయింట్ ఆంథోనీ వారి ఉన్నత పాఠశాల  (ఆర్​సీఎం)లో చదివిన తాను… అక్కడే మ్యాథ్స్​ మరియు ఫిజిక్స్​ టీచర్​ వై.శివ ప్రసాద్​ రావు, సాంఘిక శాస్ర్తం ఉపాధ్యాయుడు వి.ఎం. రుద్రయ్య  అంటే అమితమైన ఇష్టం. ఇప్పటికీ ఏదైనా సమస్య వస్తే… సలహాలు, సూచనలు తన గురువైన వై. శివప్రసాద్​ రావునే సంప్రదిస్తారు.

నటులు: ప్రజలకు సందేశాన్నందించే చిత్రాల్లో నటించే సినీ నటుడు కమల్​ హాసన్​ అంటే తనకు ఎంతో ఇష్టమంటారాయన. హాస్యం..సెంటిమెంట్​, డ్యాన్స్​…రంగరించి.. పాత్రల్లో జీవించే ఆయన నటనను ఇష్టపడే తాను… వీలు చిక్కినప్పుడల్లా కమల్​ హాసన్​  సినిమాలు చూస్తుంటారు.

న(మె)చ్చిన నేతలు : సాంకేతికను ఇండియాకు పరిచయం చేసిన రాజీవ్​ గాంధీ, ఇందిరా గాంధీ అంటే తాను మెచ్చిన నేతలు.  అదేవిధంగా హైదరాబాద్​లో హైటెక్​ సిటీ నిర్మించి… సాఫ్ట్​ వేర్​ రంగాన్ని అభివద్ధి పథంలో నిలిపిన ఆంధ్ర ప్రదేశ్​ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే కూడా న(మె)చ్చిన నాయకుడంటారాయన.

స్ఫూర్తి– ఆదర్శం:  ఇంకెవ్వరు… తన అమ్మే  ఎల్​.కె. మరియమ్మ. చిన్నప్పుడే తండ్రి ఎల్​.కె.దేవిసింగ్​ చనిపోవడంతో… అన్నీ తానై పోషించిన తన అమ్మే…తనకు స్ఫూర్తి, ఆదర్శనమని చెబుతుంటారు. అంతేకాకుండా తన గురువులైన వి.ఎం. రుద్రయ్య, వై. శివ ప్రసాద్​ రావు  తదితరులు సైతం ..తనను కొంత మేరకు ప్రభావితం చేశారని వారే తనకు ఆదర్శం అని చెబుతుంటారు.

బెస్ట్​ ఫ్రెండ్స్​:   కష్టసుఖాల్లోనూ తనకు అండగా నిలబడుతూ… భరోసానిచ్చే ప్రాణమిత్రులు మల్లికార్జునప్ప, మారెన్న.  తన ఎదుగుదలలో వీరి పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు.

సేవకు…సదా..సంసిద్ధుడే.. : తనను పోషించడానికి.. చదివించేందుకు తన తల్లిదండ్రులు పడిన కష్టం… మరెవరూ పడరాదన్న సదుద్దేశ్యంతో… చదువుకోవాలనుకునే పేద విద్యార్థులకు ఉచితంగా చదివించడం, ఆకలితో అలమటించే వారికి పట్టెడన్నం పెట్టడం. ప్రతి సంవత్సరం జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద సేవా సంస్థ నేతృత్వంలో అనాథ పిల్లలకు బట్టలు, ఆహారం, పుస్తకాలు  ఉచితంగా అందజేస్తుంటారు.

రుచి– అభిరుచి: తనది సామాన్య మధ్య తరగతి కుటుంబ నేపథ్యం…. కాబట్టిన సాత్వికాహారం అంటేనే తనకు ఇష్టం. సాంప్రదాయ వంటకాలను ఎక్కువగా ఇష్టపడే తాను…రొట్టి, గోంకూర పప్పు అధికంగా భుజిస్తారు. ఇక అభిరుచులంటే…. విద్యార్థులకు వీలైనంత విద్యార్జన చేయడంలో ఎక్కువ సమయాన్ని కేటాస్తుంటారు.

గారాభం…పనికి రాదు…: పిల్లలపై తల్లిదండ్రులకు అతి గారాభం పనికి రాదు. పిల్లలు ఆడే వయస్సులో ఆడుకోనివ్వాలి. చదువుకోవాల్సిన వయస్సులో చదువుకోనివ్వాలి. స్కూల్​ హోం వర్క్​ చేయడం… అటు పోవద్దు..ఇటు పోవద్దు.. అని ఆంక్షలు పెట్టడం వల్ల … పిల్లలు మానసికంగా బాధపడతారు. అంతేకాక వారి మేధాశక్తి కుదించుకుపోయే అవకాశం ఉంది.

తల్లిదండ్రులకు సలహా : ఒకప్పుడు పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలు చదవకపోతే… బెత్తంతో చితకబాదండి సార్​… అని చెప్పి వెళ్లే వారు. ఇప్పుడు కనీసం పిల్లలను గట్టిగా అరిస్తేనే.. తల్లిదండ్రులు టీచర్లపై దాడులకు దిగుతున్నారు. బెత్తం ఉపయోగిస్తే.. కేసులు పెట్టే పెడుతున్నారు. ఇలా ఉంటే పిల్లలు ఎలా చదువుతారు. ఉపాధ్యాయుడికి పిల్లలపై ఇవ్వాల్సిన కనీస స్వేచ్ఛ సమాజం ఇవ్వాలి. అప్పుడే పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది… అదే నని చెప్పుకొచ్చాడు.

విద్యార్థులకు సలహా : విద్యార్థులు లక్ష్యం దిశగా అడుగు వేయాలి. విద్యార్థి దశలోనే బాగా చదివి… ఉద్యోగాలు తెచ్చుకోవాలి.  ఉద్యోగాలు సృష్టించేలా రూపుదిద్దుకోవాలి. అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలలో ప్రథమంగా ఉంటుందంటారాయన.

యువతకు ..సందేశం.. : యువత తల్లిదండ్రులు…పెద్దల పట్ల గౌరవంగా నడుచుకోవాలి. నిత్యం సెల్​ ఫోన్లు.. కంప్యూటర్​ కే పరిమితం కారాదు. పెద్దల పట్ల అనుచితంగా వ్యవహరించడం, వృద్ధులను, అనాథ, వృద్ధాశ్రమాల్లో చేర్చడం తగదు. స్థిరమైన లక్ష్యాలను నిర్ణయించుకుని.. వాటి సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచిస్తోన్న తాను … యువతకు ఓ మార్గదర్శి.

అవార్డులు– ప్రశంసాప్రతం: తాను రికార్డు అసిస్టెంట్​, ఉపాధ్యాయుడిగా.. ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తాను ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా ఉన్నతాధికారుల నుంచి ఎన్నెన్నో ప్రశంసలు సైతం పొందారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఉత్తమ టీచర్​గా మన్ననలు పొందారు. జూన్​ 30న ఆయన పదవీ విరమణ పొందనున్నారు.

ఆ ఇద్దరు…దేవుళ్లు : పదో తరగతి పబ్లిక్​ ఫీజు కట్టేందుకు తనతో రూ.20 లు లేవు. అప్పట్లో  ఆ డబ్బు చాలా విలువైనది. ఎందుకంటే ముసుర్లు శుభ్రం చేసే తన అమ్మ, వ్యవసాయ  కూలీ అయిన తండ్రి ఆ మొత్తాన్ని ఇవ్వలేక… చదువు మానేయ్​ అని చెప్పేశారు. కానీ సిస్టర్​ లోరేట (బెంగుళూరు) రూ.20 లు పరీక్ష ఫీజు చెల్లించింది. అదేవిధంగా  ఇంటర్​ నుంచి డిగ్రీ వరకు ఫాదర్​ సిల్వస్టర్​ ర్యాబిలర్​ చదివించారు. ఆ ఇద్దరే తన దేవుళ్లు అని సగర్వంగా చెప్పుకొచ్చారు.

మేజర్​గా.. సందేశం: విద్యార్థులకు బంగారు భవిష్యత్​ ఇవ్వాలన్న దృఢ సంకల్పమే .. తనను మేజర్​ ( ఎన్​సీసీ) స్థాయికి తీసుకొచ్చింది. క్రమశిక్షణ..ఏకాగ్రత..పట్టుదల, పెద్దలపై గౌరవం…వంటి సద్గుణాలు ఎన్​సీసీలో నేర్పిస్తాం. ప్రాథమికోన్నత పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు ఎన్​సీసీ ఉంటుంది. రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్న విద్యార్థులకు… ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి.  

ప్రభుత్వానికిచ్చే సూచన: కేరళ విద్యావిధానాలను దేశం మొత్తం అమలు చేయాలి. కేరళలో పిల్లలు ఖచ్చితంగా విద్యనభ్యసించాలి. ఎనిమిదేళ్ల పిల్లలు కూడా అక్కడ ఇంగ్లీష్​ ను ఫ్లూయంట్​గా చదువుతున్నారు. మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ విధానం అమలులో కొంత జాప్యం జరుగుతోంది. అక్కడ ఉపాధ్యాయులు కూడా విద్యార్ధి స్థాయికి దిగి పాఠాలు నేర్పుతారు. ఆ స్థాయిలో విద్యావిధానాలను పఠిష్టంగా అమలు చేయాలి.

జీవితాశయం: ఎందరికో జీవిత పాఠాలు నేర్పిన తాను… భవిష్యత్​లోనూ పిల్లలకు ఉద్యోగ బాట నేర్పేలా ఉండటమే  జీవితాశయమంటారాయన. క్రమశిక్షణ, పట్టుదల, విలువలతో కూడిన విద్య, తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం, సహాయ గుణం, మానవత్వం వంటి లక్షణాలను విద్యార్థులు అలవర్చుకోవాలి. ఒక ఉపాధ్యాయుడిగా … నిత్య విద్యార్థిగా… ఉంటూ విద్యారంగంలో సేవ చేయడమే తన లక్ష్యమంటూ చెప్పుకొచ్చారు.

About Author