ఘనంగా గిడుగు వెంకట రామమూర్తి జయంతి
1 min readతెలుగు భాష భారత దేశoలో అత్యున్నత ప్రాచీన భాషలలో ఒకటి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల తెలుగు శాఖ మరియు ఎన్.ఎస్.ఎస్ యూనిట్-2 ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా “తెలుగు భాషా బోధన ఆధునిక పద్ధతులు” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సదస్సుకు కళాశాల కరస్పాండెంట్. కె.వి.సుబ్బారావు విశిష్ట అతిథిగా పాల్గొని తెలుగు భాష వైభవాన్ని వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ఎ. రామరాజు మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలియజేయడం కోసం విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సదస్సుకు ప్రధానవక్తగా డా. బులుసు అపర్ణ, శతావధాని, భీమడోలు మాట్లాడుతూ గిడుగు వేంకట రామ్మూర్తి పంతులుగారి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని. తెలుగునుడికారము, జాతీయాలు, పదబంధాలు, సామెతలు, తెలుగు భాషకు అందాన్ని తీసుకువచ్చాయని, భాషను వినియోగించేటప్పుడు ఉచ్ఛరణ దోషలను ఎలా నివారించాలో తెలుగు భాషను అభివృద్ధి చేసే పద్దతులను మరియు అవధాన ప్రక్రియ విశేషాల గురించి తెలియచేశారు. తెలుగు శాఖాధిపతి మేడసాని శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు భాష భారతదేశంలో అత్యంత ప్రాచీన భాషలలో ఒకటని, శ్రీకృష్ణదేవరాయలచే ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని పొగడబడిందని, నేడు తెలుగు భాష తన ఉనికికై నవతరం ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులైన బి. శంకర్ మరియు విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.