ఒక్క అవకాశం ఇవ్వండి…పాలన ఎలా ఉండాలో చూపిస్తా! పవన్కళ్యాణ్
1 min readపల్లెవెలుగువెబ్, అనంతపురం: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి పాలన ఎలా ఉండాలో చూపిస్తానంటూ జనసేన అధినేత పవన్కళ్యాణ్ రాష్ట్ర ప్రజలను కోరారు. శనివారం అనంతపురం జిల్లా కొత్తచెరువు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే రాయలసీమలో సీఎం క్యాంప్ కార్యాలయం పెడతానని మాటిచ్చారు. తన ప్రసంగంలో పవన్ మరోసారి వైసీపీ ప్రభుత్వం పనితీరుపై విరుచుకపడ్డారు. రాష్ట్రంలో రహదారుల గురించి పట్టించుకోకపోవడం వల్లె గుంతలతో కూడిన దుస్థితి నెలకొందని, ప్రతి నాలుగు అడుగులకో గుంత ఉందంటూ విమర్శించారు. తాను కొత్తచెరువుకు వస్తున్న క్రమంలో ప్రభుత్వం కేవలం అయిదురోజుల్లో రోడ్లు వేసినందన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగాలేనందుకే జనసేన రోడ్ల శ్రమదాన కార్యక్రమానికి పూనుకుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. బద్వేల్ ఉప ఎన్నిక బరిలో తమ పార్టీ పోటీ చేయడం లేదని పవన్ స్పష్టం చేశారు. అక్కడ మరణించిన దివంగత ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సుధాను గౌరవిస్తూ తాము వైసీపికి మద్దతు ఇస్తున్నామన్నారు. బద్వేల్ స్థానాన్ని ఏక్రగీవం చేసుకోవాలని కోరారు. కాగా వైసీపీ పాలన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఒక్క కియా కంపెనీని కూడా భయపెడితే కొత్తపరిశ్రమలు ఎలా వస్తాయని పవన్ ప్రశ్నించారు. నాయకులు నిజాయితీగా ఉన్నప్పుడే పాలన నిజాయితీగా సాగుతుందన్నారు. కష్టాల్లో తోడుగా ఉంటానంటూ తనకు ఒక అవకాశం ఇవ్వాలని, అధికారంలోకి వస్తే రాయలసీమలో శాంతిభద్రతలు ఎలా ఉండాలో చూపిస్తానన్నారు.