ఓపెన్ స్కూల్ మళ్లీ చదువుకోవాలి అనే వారికి మంచి సదవకాశం – తహశీల్దార్
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నాడు, మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కమిటీ చైర్మన్లు, విద్యా సంక్షేమ సహాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తహశీల్దార్ విద్యాసాగర్ మాట్లాడుతూ, ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ద్వారా చదువును మధ్యలో మానేసిన వారి కోసం, పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సులను ఇంటి వద్దనే చదువుకుంటూ పరీక్షకు హాజరై పూర్తి చేసే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ విద్యాసాగర్ సూచించారు. ఈ సమావేశంలో యంఈఓ మేరీ సునీత మాట్లాడుతూ, ఈ సర్టిఫికెట్లు అన్ని రకాలైన ఉద్యోగ అవకాశాలకు మరియు ఉన్నత చదువులకు ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఈ సమావేశంలో ఎంఈఓ విమల వసుంధర దేవి మాట్లాడుతూ, పాఠశాలల యొక్క టాయిలెట్లకు సంబంధించి, పరిశుభ్రత వివరాలను ఇప్పట్నుండి పాఠశాల ఎస్ఎంసి కమిటీ వారు మరియు విద్యా సంక్షేమ సహాయకులు ఆన్లైన్ ఆప్ లో నమోదు చేయాలని, ఎస్ఎంసి కమిటీ వారు ప్రతి బుధవారము మరియు శుక్రవారం అలాగే విద్యాసంక్షేమ నాయకులు ప్రతి సోమవారము మరియు గురువారము నమోదు చేయాలని తెలిపారు. ఈ సమావేశం అనంతరం ఓపెన్ స్కూల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలoటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కమిటీ చైర్మన్ లు, విద్యా సంక్షేమ సహాయకులు పాల్గొన్నారు.