ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
1 min readఒప్పంద జీవోలను వెంటనే విడుదల చేయాలి :-సిఐటియు
ఈ నెల 18న నంద్యాల జిల్లా కలెక్టరేట్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆశాలకు సిఐటియు పిలుపు.
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఒప్పంద జీవోలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి టి.శివరాం,మండల నాయకులు జె.వేణు కుమార్,ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు టి.చిన్నమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆశా డే సందర్భంగా డోన్ మండల పరిధిలోని చిన్న మల్కాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం డాక్టర్. చెన్నకేశవులు గారికి వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ గతంలో జరిగిన సమ్మె సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రతినిధి వర్గంతో కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోలు మరియు సర్కులర్ లు వెంటనే విడుదల చేయాలన్నారు.9 నెలలు కావస్తున్నా జీవోలు విడుదల కాక పోవడంతో ఆశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.ఈ మధ్య కాలంలో అనేక మంది ఆశాలను రిటైర్మెంట్ చేశారని 60 నుండి 62 సంవత్సరాలకు వయస్సు పెంపుదల జీవో విడుదల కాకపోవడంతో ఆందోళన నెలకొందన్నారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్,బీమా సౌకర్యాలు అందడం లేదన్నారు.ఫీల్డ్ వర్క్, సెంటర్ వర్క్ పనిచేయని సెల్ ఫోన్లతో మెజారిటీ ఆశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.గంట పర్మిషన్ కోసం,ఒకరోజు సెలవు కోసం అధికారుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.కొత్త రికార్డ్స్ ఏప్రిల్ 1 నుండి నిర్వహించాల్సి ఉండగా నేటి వరకు సప్లై చేయలేదన్నారు.నెలకు ఒకసారి ఆశా డే జరుగుతుందని ఉదయం నుండి సాయంత్రం వరకు కార్యక్రమం ఉంటుందని చిన్న మల్కాపురం పీహెచ్సీలో ఆశాలు కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా లేవని గంటల తరబడి క్రింద కూర్చోలేక ఆశాలు అవస్థలు పడుతున్న విషయాన్ని డాక్టర్ దృష్టికి తెచ్చామని వారు సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.ఒప్పంద జీవోల విడుదల కోసం ఈనెల 18న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుందని అప్పటికిీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సరళమ్మ, రాజేశ్వరి,వెంకటేశ్వరమ్మ,కళావతమ్మ తదితరులు పాల్గొన్నారు.