రైతులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ధాన్యం సేకరణ చేపట్టాలి
1 min readజాయింట్ కలెక్టర్ పి ధాత్రి రెడ్డి
జిల్లాలో250 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. ఖరీఫ్ లో ధాన్యం సేకరణకు సంబంధించి సిబ్బందికి కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు త్వరలో ప్రారంభం కానున్న దృష్ట్యా సిబ్బంది శిక్షణలో పొందిన అంశాలతో జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం సేకరించాలన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణలో పౌర సరఫరాల సంస్థ నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తుందన్నారు. జిల్లాలోని 250 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేస్తున్నామన్నారు. వీటిలో 76 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు ద్వారా 164 రైతు సేవా కేంద్రాలు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ద్వారా 45 , రైతు ఉత్పత్తి కేంద్రాల ద్వారా 2 మొత్తం 250 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించడం జరుగుతుందన్నారు. సంబంధిత కేంద్రాలలో విధులు నిర్వర్తించే సాంకేతిక సిబ్బంది, ఇతర సిబ్బందికి ధాన్యంలో తేమ శాతం లెక్కించడం, ధాన్యం తూకం, వాహనాల ద్వారా రైస్ మిల్లులకు పంపడం, తదితర అంశాలపై సంబంధిత వ్యవసాధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, కస్టోడియన్ అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, హెల్పర్ట్లు, తదితర సిబ్బందికి టిసిఎస్ సంస్థ ద్వారా సాంకేతికపరమైన శిక్షణ అందించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా తేమ శాతం కొలిచే విధానాన్ని జేసీ పరిశీలించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, జిల్లా సహకారశాఖాధికారి శ్రీనివాస్, వ్యవసాయ, పౌర సరఫరాల సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.