యువతకు స్వయం ఉపాధి పధకాలు మంజూరుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
1 min readబ్యాంకర్లు నిర్దేశించిన మేర రుణ మంజూరు లక్ష్యాలను పూర్తి చేయాలి: బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: జిల్లాలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం బిసి., ఎస్సీ కార్పోరేషన్ల యాక్షన్ ప్లాన్ కింద స్వయం ఉపాధి పధకాల మంజూరులో బ్యాంకర్లు వారికి కేటాయించిన రుణ లక్ష్యాలను త్వరతగతిన పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్లను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం బ్యాంకర్ల సమావేశం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంపొందించేందుకు కృషిచేస్తున్నదని, ఈ కార్యక్రమం లో భాగంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పధకాల ఏర్పాటులో సంబంధిత శాఖలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో బి.సి., కార్పొరేషన్ 2024-25 యాక్షన్ ప్లాన్ ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన యువతకు ఓబిఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకంలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 1901 స్వయం ఉపాధి పధకం యూనిట్లు ఏర్పాటుకు 36. 49 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. అదేవిధంగా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఓబిఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం ద్వారా 215 మంది యువతకు 4. 30 కోట్ల రూపాయలతో యూనిట్లు జిల్లాకు మంజూరయ్యాయన్నారు. బీసీ నిరుద్యోగ యువకులకు 38 జనరిక్ మెడికల్ షాపులను 3. 04 కోట్ల రూపాయలతో యూనిట్లు జిల్లాకు మంజూరయ్యాయన్నారు. యూనిట్ వ్యయంలో 50 శాతం బ్యాంకర్లు రుణాలుగా మంజూరు చేస్తారని, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీగా అందిస్తుందన్నారు. అదేవిధంగా ఎస్.సి., కార్పొరేషన్ 2024-25 యాక్షన్ ప్లాన్ ద్వారా షెడ్యూల్డ్ తరగతులకు చెందిన యువతకు స్వయం ఉపాధి పథకంలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 25. 91 కోట్ల రూపాయలతో 750 స్వయం ఉపాధి పధకం యూనిట్లు జిల్లాకు మంజూరయ్యాయన్నారు. ఈ పధకంలో లబ్ధిదారుడు 10 శాతం తన వాటాగా చెల్లించవలసి ఉంటుందని, బ్యాంకర్లు 50 శాతం రుణాలు అందిస్తారని, ప్రభుత్వం 40 శాతం సబ్సిడీగా అందిస్తుందన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపిడిఓ లు పరిశీలించి, అర్హులైన వారి దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించడం జరుగుతుందన్నారు. బ్యాంకర్లు తమకు కేటాయించిన లక్ష్యాలను అనురించి రుణాలు మంజూరు చేసి నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన యువతకు అవసరమైన సాంకేతిక పరమైన అంశాలలో సంబంధిత శాఖల అధికారులు అవగాహన కలిగించాలని, స్వయం ఉపాధి పధకాల యూనిట్లు ఏర్పాటుచేసే యువతకు దరఖాస్తు దగ్గర నుండి యూనిట్ ఏర్పాటు వరకు వారికి అవసరమైన సహకారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకర్ల వద్ద దరఖాస్తులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు రుణాలు మంజూరు చేసేలా అధికారులు బ్యాంకర్లతో సమన్వయంతో పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్. విజయరాజు, .జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, బిసి కార్పొరేషన్ ఈడి పుష్పమణి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయప్రకాశ్, ఎల్డిఎమ్ నీలాద్రి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.