PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘గుండ్రేవుల’ పై తీర్మానం..అభినందనీయం..

1 min read

 కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలన్న తీర్మానం పట్ల హర్షం

  •  పట్టిసీమ ద్వారా సీమకు లబ్ధి జరగాలంటే శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిర్వహణపై ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి
  •  రాష్ట్ర విభజన చట్టం లో పేర్కొన్న వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు రాబట్టాలి
  • రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి

కర్నూలు, పల్లెవెలుగు: గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని మరియు కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం పట్ల  రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పై అంశాలు సత్వరం అమలు జరిగేలాగా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి కోరుకుంటుందని బొజ్జా అన్నారు. జిల్లాపరిషత్ సమావేశంలో పట్టిసీమ నిర్మాణంతో రాయలసీమకు లబ్ధి అనే అంశంపై జరిగిన చర్చపై  ఆదివారం నంద్యాల సమితి కార్యాలయం నందు ఆయన స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం 2016 వ సంవత్సరంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టడాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా బొజ్జా గుర్తు చేసారు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన 80 టీఎంసీల కృష్ణా జలాలకు బదులుగా  గోదావరి జలాలను అందించే  లక్ష్యంతో పట్టిసీమ ఎత్తిపోతల  నిర్మాణం చేపట్టారని బొజ్జా పేర్కొన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణంతో కృష్ణా డెల్టాకు శ్రీశైలం ప్రాజెక్టుతో అనుబంధం తెగిపోయిందని పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా డెల్టాకు ఇక ఏమాత్రం నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ విధంగా ఆదా అయిన కృష్ణా జలాలు రాయలసీమకు మళ్లించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని బొజ్జా వివరించారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ఆదా అయిన కృష్ణా జలాలను  శ్రీశైలం రిజర్వాయర్లో నిలువ ఉంచి రాయలసీమ ప్రాజెక్టులకు వినియోగించాలి. దీని కోసం శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టం 854 అడుగులు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాలు చేపట్టకుండా పట్టిసీమ ద్వారా రాయలసీమకు లబ్ధి అనేది కేవలం “ఒట్టి మాటలుగా” మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి ఆకాంక్షించే ప్రజాప్రతినిధులందరూ ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి శ్రీశైలం జలాశయంలో రాయలసీమ నీటి హక్కులను కాపాడే విధానాలను అమలుపరిచేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి విజ్ఞప్తి చేస్తోందని బొజ్జా అన్నారు. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజి నిధుల సాధన కోసం రాయలసీమ ప్రజా ప్రతినిధులు  చొరవ తీసుకుని రాయలసీమ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

About Author