1న హనుమజ్జయంతి ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కడప జిల్లా మండల కేంద్రమైన చెన్నూరు బ్రాహ్మణ వీధిలో వెలసియున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నందు జూన్ ఒకటో తేదీన శనివారం హనుమజ్ఞయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ చర్యలు చేపట్టింది. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ అభినవ ఉద్దండ విద్య శంకర భారతి స్వామి వారి ఆశీస్సులతో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం ఐదు గంటలకు వేద పండితులు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించనున్నారు. ఉదయం ఐదున్నర గంటలకు మూల విరాట్ విగ్రహములకు అభిషేక మరియు అలంకరణ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు ఆలయానికి వచ్చే భక్తులకు సర్వదర్శనం ఏర్పాట్లు చేశారు. ఉదయం 8:30 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహమునకు వేద పండితుల చేతుల మీదుగా ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పంచామృతాన్ని ఒక గ్లాసులో స్వయంగా తమ ఇంటి వద్దనే తయారు చేసుకొని ఆలయానికి వచ్చి ఉత్సవ విగ్రహానికి తమ స్వహస్తాలతో స్వయంగా అభిషేకం చేసుకోవచ్చని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని కోరారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి చెన్నూరు కు చెందిన గలిజర్ల సాంబరాజు వారి కుటుంబ సభ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపులో నెల్లూరు బృందం వారిచే కోలాటం వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.