ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం
1 min readబాలికలు అన్నింటా రాణించాలి
ఆడపిల్లలకు బంగారు భవితనిద్దాం
జిల్లా కలెక్టర్ తో కలిసి మహిళల బైక్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి)
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: బాలికలకు సామాజికంగా, ఆర్ధికంగా, మానసికంగా భరోసానివ్వాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. స్ధానిక సెయింట్ థెరీస్సా మహిళా కళాశాలలో జిల్లా మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆద్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి)తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. దీనిలో భాగంగా స్ధానిక అమరావతి సెంటర్ నుంచి సెయింట్ థెరీస్సా కళాశాల వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ప్రారంభించారు. అనంతరం సంతకాల సేకరణలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధకృష్ణయ్య(చంటి) సంతకాలు చేశారు. ఆడపిల్లలను సంరక్షించి విద్యావంతులను చేస్తామని ఈ సందర్బంగా ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లల పట్ల ఎలాంటి వివక్షలేకుండా చూసేందుకు ఎన్నోచట్టాలు ఉన్నాయన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకోసం పిసిపిఎన్ డిటి చట్టం అమల్లో ఉందన్నారు. అదే విధంగా బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేదింపులకు గురిచేసేవారిపై లైంగిక నేరాల నిరోధక చట్టం(ఫోక్సో) కింద కేసులను నమోదుచేయడం జరుగుతుందన్నారు. ఆడపిల్లల భధ్రతకు ఎక్కడైనా భంగం కలిగితే వెంటనే 1098 నెంబరుకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలో 2225 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని ఇందులో 40 వేల 243 మంది 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలు కలిగియున్నారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 46 మంది పిల్లలను దత్తత ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాలో బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమాల ద్వారా అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆడపిల్లల సాధికారితకు దోహదపడే విద్యపై ప్రతి బాలిక మంచి విద్యను అభ్యసించాలన్నారు. శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) మాట్లాడుతూ బాలికలు విద్యావంతులయ్యేందుకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. ఎటువంటి వివక్షతకు తావులేకుండా అభివృద్ధి చెందగల సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మహిళలకు అన్ని రంగాల్లోను ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించి విద్యలోను, ఉద్యోగాల్లోను, రాజకీయాల్లోను రాణించే విధంగా అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో బాలికల పాత్ర గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఐటి రంగంలో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని దీనికి కారణం వాళ్లు విధులలో చూపించే వారి ప్రత్యేకమైన శ్రద్ధే కారణమన్నారు. తల్లిదండ్రులకు అవగాహన పెరిగిందని తమ పిల్లలకు ఉన్నతమైన విద్యాభోధనలు కలిగించడానికి శాయిశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలకు కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుని అన్నిరంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.కార్యక్రమంలో డిఇఓ వెంకట లక్ష్మమ్మ, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు వి. శ్రీలక్ష్మి, సెరీకల్చర్ డిడి డి. వాణి , జిల్లా బి.సి. సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్. కృపావరం, జిల్లా పంచాయితీ అధికారి కె. అనురాధ, సిడిపివోలు, అంగన్వాడీ సూపర్ వైజర్లు, కార్యకర్తలు, సెయింట్ థెరీస్సా మహిళా కళాశాల లెక్చరర్లు, విద్యార్ధినీలు, తదితరులు పాల్గొన్నారు.