ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తా.. : టి.జి భరత్
1 min read– అలిషరీబాగ్, బి.క్యాంపులో టి.జి భరత్ భరోసా యాత్ర
- సమస్యలు మొరపెట్టుకున్న స్థానికులు
కర్నూలు, పల్లెవెలుగు: ప్రజలకు తోడుగా ఉంటానని చెబుతూ భరోసా యాత్రను కొనసాగిస్తున్నట్లు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. నగరంలోని అలిషరీబాగ్, బి.క్యాంపులో ఆయన టి.జి భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. వీధివీధిలో తిరుగుతూ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలిసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రజలు విద్యుత్ తీగలు, కాల్వలు, త్రాగునీరు, పెన్షన్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలు ఎవ్వరూ పరిష్కరించడం లేదని మొరపెట్టుకున్నారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలందరికీ సమస్యలే మిగిలాయన్నారు. ఏ వీధికి వెళ్లినా ఇవే సమస్యలు చెబుతున్నారన్నారు. తాను గెలిచిన తర్వాత డ్రైనేజీ, విద్యుత్ తీగల సమస్యలను ప్రణాళికాబద్దంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ త్రాగునీరు అందించేందుకు తప్పకుండా కృషి చేస్తానని చెప్పారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తానన్నారు. ప్రజలు కులం, మతం చూడకుండా తనకు ఓటు వేసి గెలిపిస్తే ఇవన్నీ చేయడానికి తనకు అవకాశం వస్తుందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వబోతున్నట్లు తెలిపారు. కర్నూలుకు తాను ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలకు మంచి చేసేందుకు ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొరేటర్, జనసేన ఇంచార్జి అర్షద్, కార్పొరేటర్ లతీఫ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతా మాధురి, టిడిపి నేతలు ఆర్జా రామకృష్ణ, హమీద్, శ్రీధర్, మోయిన్ బాషాజ్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. బి. క్యాంపులో యాత్ర ప్రారంభం సమయంలో బిజెపి నేతలు భారీ గజ మాలతో స్వాగతం పలికారు.