శిశువు పుట్టిన మూడు గంటలకే గుండె ఆపరేషన్
1 min read* తల్లి కడుపులోనే శిశువుకు గుండె సమస్య గుర్తింపు
* పుట్టిన 3 గంటలకే బెలూన్ యాంజియోప్లాస్టీ
* అరుదైన ప్రొసీజర్‌తో ప్రాణాలు కాపాడిన వైనం
* కర్నూలు కిమ్స్ కడల్స్ ఆస్పత్రి వైద్యుల ఘనత
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు, ఆగస్టు 6, 2024: సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత మాత్రమే ఏవైనా ఆరోగ్య సమస్యలు బయటపడతాయి. కానీ, పుట్టకముందే సమస్యలను గుర్తించడం, ఆ సమస్యను పరిష్కరించడం చాలా అరుదు. ఒకవేళ అలా ముందుగా గుర్తించలేకపోతే.. పుట్టిన కొద్ది సమయానికే పిల్లలకు పరిస్థితి బాగా విషమించి, వైద్యం అందించే లోపే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం కూడా ఉంటుంది. ముందుగా గుర్తించడం వల్ల సమయానికి వైద్యం అందించి ప్రాణాలు కాపాడగలరు. సరిగ్గా అలాంటి ఘటనే కర్నూలు కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన ప్రముఖ చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ కె. మహమ్మద్ ఫారూక్ తెలిపారు. “కర్నూలుకు చెందిన ఓ మహిళ గర్భవతిగా ఉండగా, నెలలు నిండిన తర్వాత బయట ఆస్పత్రిలో స్కాన్ చేయించినప్పుడు.. శిశువు గుండెలో ఏదో సమస్య ఉన్నట్లుగా అనుమానించారు. అక్కడినుంచి వాళ్లు కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి పంపారు. ఇక్కడ ఆ శిశువుకు గర్భంలో ఉండగానే “2డి -ఇకో” స్కానింగ్ తీసి చూడగా.. బృహధమని ద్వారం సన్నబడి, రక్త సరఫరా సరిగా జరగటం లేదని, అందువల్ల గుండె పనితీరు దారుణంగా దెబ్బతిందని తెలిసింది. అప్పటికే మహిళకు నెలలు నిండడంతో ముందుజాగ్రత్తగా సిజేరియన్ చేసి, బాబును బయటకు తీశాం. పుట్టిన వెంటనే బాబును వెంటిలేటర్ మీద పెట్టి మరోసారి “2డి -ఇకో” స్కానింగ్, ఇతర పరీక్షలు చేశాం. ముందు అనుకున్నట్లు గానే గుండె లో అతిపెద్ద ధమని అయిన బృహధమని ముఖాద్వారం సన్నబడి దాదాపుగా మూసుకుపోయింది (aortic stenosis) దానివల్ల గుండె నుండి శరీర అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా జరగని పరిస్థితి ఏర్పడి, దానివల్ల గుండె సరిగా పనిచేయడం లేదని గుర్తించాము.బాబు పుట్టిన మూడు గంటలకు బెలూన్ యాంజియోప్లాస్టీ చేయాలని నిర్ణయించాం. ఇంత చిన్న పిల్లలకు ఇలాంటి ప్రక్రియలు చేయడమే అరుదైతే, పుట్టడానికి ముందే గుర్తించి చేయడం మరీ అరుదు. అత్యంత జాగ్రత్తగా బెలూన్ యాంజియోప్లాస్టీ చేయడంతో , గుండె సాధారణంగా పనిచేయడం ప్రారంభించింది. ఈ ప్రొసీజర్ చేయకపోయి ఉంటే బాబుకు గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్తం సరఫరా అయ్యేది కాదు. దానివల్ల మరింత సంక్లిష్టమైన సమస్యలు వచ్చేవి. ఈ శస్త్రచికిత్సను నియోనటాలజిస్ట్ డా. భరత్ రెడ్డి, డా. రచన, గైనకాలజిస్ట్ డా. కుసుమ, కార్డియాక్ అనెస్థీషీయా నిపుణురాలు డా. జ్యోస్న సమన్వయంతో చేశాం. పుట్టకముందే గుర్తించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా బాబును కాపాడగలిగాం. అయితే, తర్వాత కూడా రెండు మూడేళ్ల పాటు ఫాలోఅప్ చేయిస్తూ, ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. రెండు మూడేళ్ల తర్వాత కూడా అవసరమైతే మరోసారి బెలూన్ యాంజియోప్లాస్టీ చేయాల్సి రావచ్చు. తల్లిదండ్రులకు ఈ మేరకు జాగ్రత్తలు చెప్పి, బాబును నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జి చేశాం” అని ఆయన వివరించారు.