భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సిద్ధంగా ఉండాలి
1 min readనగరంలో హంద్రీ, తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అన్ని విధాలా ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.మంగళవారం నగరంలోని జొహరాపురం బ్రిడ్జి మీదుగా ప్రవహిస్తున్న హంద్రీ నదిని, అనంతరం పాతబస్తీలోని రాఘవేంద్ర స్వామి మఠం వెనుక ఉన్న తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందుగా జొహరాపురం బ్రిడ్జి మీదుగా ప్రవహిస్తున్న హంద్రీ నదీ ప్రవాహాన్ని పరిశీలించారు..ఒకవేళ భారీ వర్షాలు వస్తే ఎన్ని క్యూసెక్కుల మేర నీరు వచ్చే అవకాశం ఉంటుంది, ఏఏ ప్రాంతాలు ప్రభావితం అవుతాయి అన్న వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 5 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే కొన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, ప్రస్తుతం 60 వేల క్యూసెక్కులు మాత్రమే ఉందని అధికారులు తెలిపారు..మ్యాపు ద్వారా ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు..ప్రస్తుతం జిల్లాలో అల్పపీడనం ప్రభావం అంతగా లేదని, అయినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండి, పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ ఇరిగేషన్, మున్సిపల్ కమీషనర్, కర్నూలు ఆర్డీఓ లను ఆదేశించారు. హంద్రీ నదీ చుట్టూ ఉన్న జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. ఈ అంశంపై చర్చించేందుకు ఇరిగేషన్,మున్సిపల్ కమీషనర్, కర్నూలు ఆర్డీఓలతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.అనంతరం పాతబస్తీలోని రాఘవేంద్ర స్వామి మఠం వెనుక ఉన్న తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.జిల్లా కలెక్టర్ వెంట కర్నూలు మున్సిపల్ కమీషనర్ ఎస్.రవీంద్ర బాబు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు అర్బన్ తహసీల్దార్ వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.