భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి
1 min readమద్దిలేరు వాగు బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరద నీటి ఉధృతి పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం నంద్యాల పట్టణం నుండి పివి నగర్, భీమవరం వెళ్లేదారిలో మద్దిలేరు వాగు బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరద నీటి ఉధృతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నంద్యాల ఆర్డీఓ మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ కుందూ నది పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మద్దిలేరు వాగు బ్రిడ్జిపై ప్రవహిస్తున్న నీటిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత గ్రామాల రాకపోకలను నిలిపివేస్తూ…ఎవరినీ అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పోలీసు అధికారులను ఆదేశించారు. కుందా నది నీటి ప్రవాహాల ఉధృతిపై ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులతో తెలుసుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, చెరువులు, రిజర్వాయర్ల వద్ద నిరంతర నిఘా వుండి అందరినీ అప్రమత్తం చేయాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా కూలిన చెట్లు ఉంటే వెంటనే క్లియర్ చేయాలని పంచాయతీ రాజ్, ఆర్అండ్బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు.పంట పొలాల్లో నిలువ ఉన్న వర్షపు నీటిని బయటకు పంపించేందుకు, పశు సంపదకు నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్సలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ ప్రభుత్వ మెనూ ప్రకారం వేడి వేడి ఆహార పదార్థాలు అందించడంలో పాటు ఆరోగ్య చర్యలపై జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ, సోషల్, బిసి వెల్ఫేర్, ఇతర హాస్టళ్ల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కాలువలు కల్వర్టులలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ నీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు ముమ్మరం చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. త్రాగునీటి పైపులు లీకేజై నీరు కలుషితం కాకుండా క్లోరినేట్ చేసిన రక్షిత మంచినీటినే స్రఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నీటి కాలుష్యం ఎక్కడైనా జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. శిధిలావస్థకు చేరుకున్న మట్టి మిద్దెలలో నివాసం వుంచకుండా సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కూలిన విద్యుత్ స్తంభాలు వుంటే క్లియర్ చేయడంతో పాటు షార్ట్ సర్క్యూట్‌లు, తడిసిన విద్యుత్ స్తంభాలకు షాక్‌లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.భారీ వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం మానిటర్ చేస్తున్నారని అధికారులందరూ స్థానికంగా అందుబాటులో ఉంటూ జిల్లాలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు.