అంగరంగ వైభవంగా హేలాపురి బాలోత్సవం
1 min readఅంబరాన్ని తాకిన 5వ పిల్లల సంబరాలు
మార్కులు,ర్యాంకులే కాదు. మానసిక వికాసానికి ఆటలు, పాటలు అవసరం
జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి
శాస్త్రీయ దృక్పథం, జాతీయ సమైక్యతను బాల్యం నుండి పెంపొందించాలి
ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ పి.గోపీమూర్తి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: రంగు రంగుల దుస్తుల్లో, రకరకాల వేషధారణలో విద్యార్థులు, వారి పక్కన వారి తల్లిదండ్రులు, బంధువులు, ఆటలు, పాటలు, సరదాలు, సంబరాలు పోటీలు, పొగడ్తలు, కేకలు, కేరింతలతో తొలిరోజు పిల్లల సంబరాలు అంబరాన్ని తాకాయి.హేలాపురి బాలోత్సవం 5 వ పిల్లల సంబరాలు వట్లూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్ నందు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఎన్సిసి లెఫ్ట్నెంట్ కల్నల్ రిబేష్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే బాలోత్సవం జెండాను ఉష గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత ఉష బాలకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రారంభ సభకు బాలోత్సవం ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ గోపి మూర్తి, జాయింట్ కలెక్టర్ పి దాత్రి రెడ్డి హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి మాట్లాడుతూ ఈ బాలోత్సవం కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని, హేలాపురి బాలోత్సవం కార్యక్రమాన్ని మన ఏలూరులో నిర్వహించుకోవడం ఎంతో అదృష్టం అని అన్నారు. చిన్నప్పుడు చదువుకోవడం, పరీక్షలు, ర్యాంకులు వీటితోనే సమయం సరిపోయేదనీ, పిల్లల మీద చదువు ఒత్తిడి మాత్రమే పెడితే సరిపోదని, పదవ తరగతిలో వందకి 100% మార్కులు వచ్చినా జీవితంలో పైకి వస్తాం అనే గ్యారెంటీ లేదని అన్నారు. అదే చిన్నప్పటి నుంచి పిల్లలకు దేనిలో అభిరుచి ఉందో దానిపైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తే వారు జీవితంలో మంచి స్థానానికి రావడానికి ఆస్కారం ఉందని అన్నారు. విద్యార్థులను ఈ రెండు రోజులు సరదాగా గడపమని సూచించారు.ఎమ్మెల్సీ గోపి మూర్తి మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటినుంచి ఒక శాస్త్రీయ దృక్పథం అలవాటు చేస్తే దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దబడతారని అన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ ఆ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో విఫలమైందని తెలుస్తుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో సంఘ విద్రోహ చర్యలు, అనేక విపత్కర పరిస్థితిలు పెరిగిపోతున్నాయని, వాటిని నివారించాలంటే పిల్లలలో మార్పు తీసుకురావాలని అన్నారు. ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాల నుంచి నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. వినోదం, వికాసంతో పాటు జాతీయ సమైక్యత, శాస్త్రీయ దృక్పథం వంటివి పిల్లల్లో పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించడం అభినందనీయం అన్నారు. సంక్రాంతి అంటే పేకాట, గుండాట, కోడిపందాలు అనే ఆలోచన పెద్దలతో పాటు పిల్లల్లో కూడా పెరిగిపోయిందని, వాటికి సంక్రాంతి మూడు రోజులు వాటికి విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి, ఆకివీడులో 42 సంవత్సరాల నుంచి ఆటల పోటీలు నిర్వహిస్తుంటే దానికి సీఈఓ, డీఈవో అనుమతులు నిరాకరించి ఆఖరి క్షణంలో అనుమతులు ఇవ్వటం బాధాకరం అని, పిల్లలకు మంచి సంస్కృతిని సాంప్రదాయాలను చిన్న స్థాయి నుంచి అలవాటు చేసి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చూడాలని తెలిపారు. అనంతరం అతిథులు సిఆర్ రెడ్డి కళాశాల జనరల్ సెక్రెటరీ మాగంటి ప్రసాద్, నెక్స్ జన్ సంస్థ ఎండి అడిసుమల్లి వెంకట సుబ్రహ్మణ్యం, నాగ హనుమాన్ సంస్థ డైరెక్టర్ పి భాస్కర్ మాట్లాడుతూ ఈ పిల్లల సంబరాలకు తమ వంతు సహకారం అందిస్తామని, వచ్చే సంవత్సరం అవసరం అయితే తమ ప్రాంగణాలను ఉపయోగించుకోవచ్చు అని సూచించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు: ఈ పిల్లల సంబరాల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభాపాటవాలు ప్రదర్శించారు. శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జానపద బృంద నృత్యాలకు ప్రేక్షకులు మైమరిచిపోయారు.అలాగే అభ్యుదయ గీతాలు, కోలాట ప్రదర్శనలు, దేశభక్తి గీతాల పోటీలలో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. అంతేకాక చిత్రలేఖనం, కథా రచన, కవితా రచన, మైక్రో ఆర్ట్స్, మ్యూజిక్, ఏకపాత్రాభినయం వంటి అంశాలలో విద్యార్థులు వయస్సుతో సంబంధం లేకుండా పోటీపడి తమ ప్రతిభను కనబరిచారు. అలాగే ఆత్మ రక్షణ కోసం ఉపయోగించే కర్ర సాము పోటీలో విద్యార్థులు పాల్గొనడం విశేషం.