కిడ్నీ సమస్య ఉందని వెళ్తే.. బయటపడ్డ రక్త క్యాన్సర్!
1 min readపది లక్షల మందిలో ఒక్కరికే వచ్చే అత్యంత
అరుదైన వాస్క్యులర్ లిమిటెడ్ అమైలోయిడోసిస్
దానికి మూలకారణం రక్తంలో క్యాన్సర్ అని గుర్తించిన
కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు
త్వరగా గుర్తించడంతో సత్వరచికిత్సతో రోగి ప్రాణాలు కాపాడిన వైనం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ముందు దశల్లో క్యాన్సర్‌ను గుర్తించడం చాలా అరుదుగా జరుగుతుంది. నిజానికి దీన్ని ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత త్వరగా, బాగా తగ్గుతుంది. కిడ్నీ సంబంధిత సమస్యతో వచ్చిన ఓ వృద్ధుడిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అతడికి క్యాన్సర్ మొదలైందని గుర్తించారు కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు. దానివల్ల ఆయనకు వెంటనే చికిత్స ప్రారంభించి అన్ని సమస్యలనూ పరిష్కరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ కె. అనంతరావు తెలిపారు.
“కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల గోవిందప్పకు ఊపిరి అందకపోవడం, కాళ్లు వాయడం, మూత్ర విసర్జన తగ్గడంతో తొలుత వేరే ఆస్పత్రిలో చూపించుకుని, అక్కడ నయం కాకపోవడంతో కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆస్పత్రిలోని నెఫ్రాలజీ విభాగంలో ఆయనకు తగిన వైద్య పరీక్షలు చేయగా, మూత్రంలో రక్తం, ప్రోటీన్ లీక్ అవుతున్నట్లు గుర్తించాము. దాంతోపాటు సీరం క్రియాటినైన్ స్థాయి 3.5 ఎంజీకి పెరిగిపోయింది. ఉదరభాగానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే, కిడ్నీలు అసాధారణంగా కనిపించాయి. కానీ ఆయన మూత్రపిండాల వైఫల్యానికి కారణం ఏంటో కనిపించలేదు. దాంతో ఆయనకు కిడ్నీ బయాప్సీ చేశాము. అందులో ఆయనకు ప్రతి పది లక్షల మందిలో ఒక్కరికే వచ్చే అత్యంత అరుదైన వాస్క్యులర్ లిమిటెడ్ అమైలోయిడోసిస్ అనే వ్యాధి వచ్చినట్లు తెలిసింది. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందా అని మరిన్ని పరీక్షలు చేశాము. అందులో సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్, బోన్ మ్యారో బయాప్సీ లాంటివి కూడా ఉన్నాయి. అప్పుడు ఆయనకు మల్టిపుల్ మైలోమా అనే ఒక రకం రక్తక్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధిలో క్యాన్సర్ కణాలు అరుదైన ప్రోటీన్లను రూపొందిస్తాయి. అవి కిడ్నీలు, గుండెల్లో చేరి వాటి వైఫల్యానికి దారితీస్తాయి.
క్యాన్సర్ ఉన్నట్లు తేలడంతో ముందుగా రోగికి కెమోథెరపీ ప్రారంభించాము. దాంతో ఆయన పరిస్థితి మెరుగైంది. రక్తక్యాన్సర్ ఉండటం వల్లే గోవిందప్ప గుండె, మూత్రపిండాలు పాడవ్వడం ప్రారంభమైంది. దాన్ని ఈ కేసులో ముందుగా గుర్తించడం వల్లే రోగి ప్రాణాలు కాపాడగలిగాము. ఇలాంటి కేసుల్లో గుర్తించడం ఆలస్యమైతే ఆయా అవయవాలు బాగుచేయలేనంతగా పాడైపోయి, చివరకు మరణం సంభవిస్తుంది. కిడ్నీ బయాప్సీ చేయడం ఎంత ముఖ్యమో ఈ కేసు వివరిస్తుంది. దీనివల్ల కిడ్నీ వ్యాధి మూలకారణం గుర్తించడంతోపాటు లోపల దాగున్న రక్తక్యాన్సర్‌ను కూడా గుర్తించగలిగాం. కిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 500 మందికిపైగా రోగులకు కిడ్నీ బయాప్సీ చేశాం. కిమ్స్ ఆస్పత్రిలోని నెఫ్రాలజీ విభాగంగలో డాక్టర్ అనంతరావు, డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో సీఆర్ఆర్‌టీ, కిడ్నీ మార్పిడి లాంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. కిడ్నీ సంరక్షణ విషయంలో సమగ్ర చికిత్సలకు, సెకండ్ ఒపీనియన్‌కు కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలోని నెఫ్రాలజీ విభాగాన్ని 9000819193 నంబరులో సంప్రదించవచ్చు” అని ఆయన తెలిపారు.