దుఃఖానికి కారణం అవిద్య…
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
పెరవలిలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దుఃఖానికి కారణం అవిద్య అని, ఆ అవిద్యను దూరం చేసి, శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేది బ్రహ్మ విద్య అని, అటువంటి బ్రహ్మ విద్య సాంప్రదాయానికి మూలం భారతదేశమని, ఇటువంటి చరిత్ర కలిగిన ఈ దేశంలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతమని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మద్దికెర మండలం, పెరవలి గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు నాలుగు రోజుల ధార్మిక కార్యక్రమాల సందర్బంగా వారు ప్రారంబోపన్యాసం చేశారు. తదనంతరం డాక్టర్ ఎస్. దేవి దయానంద సింగ్ చేసిన ధార్మిక ప్రవచనం భక్తులను ఎంతగానో అలరించినది. తదనంతరం భజన మండలి అధ్యక్షులు, మాజీ సర్పంచ్ వెంకట రామ వర్మ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రబ్బా వీరయ్య, ప్రధానార్చకులు కొమండూరి రంగనాథా చార్యులు, స్థానిక భక్త బృందం సభ్యులు పారా రామచంద్ర ప్రసాద్, పురుషోత్తమ చౌదరి, ధర్మ ప్రసార ప్రముఖ్ డి. హనుమంతరావు రామలింగారెడ్డి, సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.