వసతి గృహాల్లో – పరిశుభ్రత తప్పక పాటించాలి
1 min readవసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
పల్లెవెలుగు వెబ్ ఆదోని: వసతి గృహాల్లో పరిశుభ్రత తప్పక పాటించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. ఆదివారం కోసిగి మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహంలోని పరిసరాలను మరియు ప్రతి గదిని, టాయిలెట్స్, వంట గది, నీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేనందువలన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అధికారులకు హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సబ్ కలెక్టర్ వసతి గృహాల్లో ఉన్న సమస్య లపై ఆరా తీయగా… మరుగు దొడ్లు సరిగ్గా లేవని, త్రాగు నీటి సమస్య, సరైన విద్యుత్ సదుపాయం లేదని, రాత్రి సమయం లో వసతి గృహం లో సరైన సెక్యూరిటీ లేదని, వారం కు ఒక సారి ఇచ్చే చికెన్ ఆహారంలో సరైన నాణ్యత, పరిమాణం లేదని, వసతి గృహాల్లో సరైన మరమ్మత్తులు చేపట్టలేదని సబ్ కలెక్టర్ గారికి విద్యార్థులు యెక్క సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ వసతి గృహంలో ఉన్న సమస్యలపై ఫోన్ కాల్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడుతూ… కోసిగి ఇంటిగ్రేటెడ్ వసతి గృహంలో చాలా సమస్యలు ఉన్నాయని వాటికి సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వారం రోజులుకు ఒక సారి పర్యవేక్షణ అధికారులు పర్యవేక్షించి వసతి గృహం యొక్క సమస్యలను పరిష్కరించాలన్నారు. విధులు పట్ల నిర్లక్ష్యం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ… వసతి గృహాల్లో ఏదైనా సమస్య ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు అన్నారు. విద్యార్థి దశలోనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని వాటికోసం ప్రతిరోజు సాధన చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిత్యానంద రాజు, ఉప తాసిల్దార్ రుద్ర గౌడ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.