ఇంటర్న్ షిప్ నోడల్ ఆఫీసర్లతో వీ.సి. ఛాంబర్లో సమీక్ష
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కాలేజిల్లో డిగ్రీ ఆరవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు సెమిస్టర్లాంగ్ ఇంటర్న్ షిప్ రిజిస్ట్రేషన్లను ఈ నెల 21వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంటుందని వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ తెలిపారు. ఇంటర్న్ షిప్ రిజిస్ట్రేషన్ల విషయమై వర్సిటీ పరిధిలోని కర్నూలు, నంద్యాల జిల్లాల ఇంటర్న్ షిప్ రిజిస్ట్రేషన్ల విషయమై ఈరోజు వర్సిటీ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఇంటర్న్ షిప్ నోడల్ ఆఫీసర్లతో వి.సి. తన ఛాంబర్లో సమీక్షించారు. డిగ్రీ ఫైనలియర్లో 6వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థుల ఇంటర్న్ షిప్ రిజిస్ట్రేషన్లను సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈనెల శనివారంలోగా ఆన్లైన్లో పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రప్రభుత్వంతోపాటు, ఉన్నత విద్యా మండలి ఈదిశగా ఇప్పటికే ఆదేశాలు జారీచేసిందన్నారు. ఉన్నతవిద్యామండలి గుర్తించిన సంస్థల్లోనే తప్పనిసరిగా ఇంటర్న్ షిప్ రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంటుందన్నారు. రాయలసీమ యూనివర్సిటీకి అనుబంధంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని మొత్తం 92 డిగ్రీకాలేజీల్లో B.A., కోర్సుల కాంబినేషన్లో 1422 మంది, B.Com., కోర్సుల కాంబినేషన్లో 3481మంది, B.Sc., కోర్సుల కాంబినేషన్లో 2965 మంది, ఇతర కోర్సుల్లో 586 మందితోకలిపి మొత్తం 8454 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఇంటర్న్ షిప్స్ చేయాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడు వివరించారు. రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న విద్యార్థులు సుమారు 4 నెలలపాటు ఇంటర్న్ షిప్ కొనసాగించాల్సి ఉంటుందన్నారు. ఆయా విద్యార్థులు తమ ఇంటర్న్ షిప్ పురోగతిని నిర్దేశించిన ప్రొఫార్మాలో స్వదస్తూరితో పూర్తిచేసి వర్సిటీకి సమర్పించాల్సి ఉంటుందని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు. అప్పుడుమాత్రమే ఆ విద్యార్థులకు సెమిస్టర్ చివర్లో వైవావోస్ పరీక్షలు నిర్వహించడానికి వీలవుతుందన్నారు. ఇంటర్న్ షిప్‌ల విషయంలో సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్న్ షిప్‌లకు సంబంధించిన ఇతర సమాచారంకోసం వర్సిటీలోని నోడల్ ఆఫీసర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.