జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వండి
1 min readప్రజలకు త్రాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నీటి పరీక్షలు చేయాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జలవనరులు, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా టిబిపి ఎల్ ఎల్ సి, ఆలూరు బ్రాంచ్ కెనాల్, కేసీ కెనాల్, హంద్రీ నీవా, సంజీవయ్య సాగర్ (గాజుల దిన్నె ప్రాజెక్ట్), వేదవతి, ఆర్డీఎస్,కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజి(సుంకేసుల బ్యారేజి), గూగుల్ మ్యాప్ ల ద్వారా పరిశీలించి జిల్లా కలెక్టర్ కూలంకషంగా తెలుసుకున్నారు.తుంగభద్ర ఎల్ఎల్సీ కెనాల్ ఎక్కడ ప్రారంభం అయింది,ఎక్కడ ఎండ్ అవుతుంది, దాని నుండి మన జిల్లాకు ఎంత మేర నీటిని విడుదల చేస్తున్నారు, కర్నూలు నగరం తాగునీటి అవసరాలు ఎలా తీరుస్తున్నారు అన్న విషయాలను జలవనరుల శాఖ ఎస్ఈని అడిగి తెలుసుకున్నారు. తుంగభద్ర ఎల్ఎల్సీ కెనాల్ ద్వారా జిల్లాలోని 194 గ్రామాల్లో 1,51,134 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని, తాగునీటిని కూడా అందించడం జరుగుతోందని, తుంగభద్ర డ్యాం నీటి లభ్యతను బట్టి నీటిని కేటాయించడం జరుగుతోందని ఇరిగేషన్ ఎస్ఈ కలెక్టర్ కు వివరించారు.
అలాగే సుంకేసుల బ్యారేజ్ నీటి సామర్థ్యం, సంజీవయ్య సాగర్ సామర్థ్యం పెంపు పనులు, కేసీ కెనాల్ ద్వారా ఆయకట్టు వివరాలు, హంద్రీ నీవా పనులు,వేదవతి ప్రాజెక్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు ఎంతవరకు జరిగాయి, 68 చెరువుల నిర్మాణ పనులను ఇరిగేషన్ ఎస్ఈ కలెక్టర్ కు వివరించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలు ఏమున్నాయి, ఆర్థికంగా నిధుల అవసరం, ప్రభుత్వం నుంచి కావలసిన అనుమతులు,అంతర్రాష్ట్ర సమస్యలు, ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి గురించి సమగ్రంగా నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ ఎస్ఈ ని ఆదేశించారు…అలాగే ప్రతి ప్రాజెక్టుకు నది ఎక్కడ మొదలవుతుంది, ట్రిబ్యుటరీలు, క్యాచ్మెంట్ ఏరియా, జలాశయాలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ల మ్యాప్ ల ను విడివిడిగా జనరేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు..ప్రాజెక్టులు,జలాశయాల్లో నీటి లభ్యతను గుర్తించడానికి సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల పై చర్చించేందుకు ప్రజా ప్రతినిధులతో చర్చించి ఐఎబి సమావేశం ఏర్పాటు కు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇరిగేషన్ ఎస్ఈ ని ఆదేశించారు.త్రాగు నీటి పథకాలను ప్రజలకు ఇబ్బంది లేకుండా సక్రమంగా నిర్వహించడం తో పాటు నీటిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. త్రాగు నీటి పథకాలకు సంబంధించిన ఇరిగేషన్ సోర్సెస్ వివరాల నివేదికలను, మ్యాపులను సిద్ధం చేయాలని పంపించాలని కలెక్టర్ ఆదేశించారు..జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఇప్పటివరకు 1026 పనులు పూర్తి చేయడం జరిగిందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కలెక్టర్ కు వివరించారు.సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.