ప్రజలపై భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఎన్నికల కంటే ముందు శుద్ధ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలను మోపుతున్నదని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని వైసీపీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు శుక్రవారం పత్తికొండలో వైసీపీ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద నిరసన ర్యాలీ చేపట్టింది. ముందుగా అంబేద్కర్ కూడలిలో మాజీ పిఎం మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీతో బయలుదేరి నాలుగు స్తంభాల కూడలి వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపే ట్రూ అప్ చార్జీల పేరిట నవంబర్, డిసెంబర్ నెలల్లో రెండుసార్లు కరెంటు చార్జీలు పెంచి దాదాపు 15,400 కోట్లు ప్రజల మీద భారం పెట్టారన్నారు. సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పత్తికొండ మీటింగ్లో మాట్లాడిన విషయాల్ని గుర్తు చేస్తూ సంపద అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను కచ్చితంగా అమలు చేయాలని, చేయని పక్షంలో ప్రతిపక్షం ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మెడలు వంచి అమలు చేయిస్తామన్నారు. సమస్యల పరిష్కారం కోసం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ, స్థానిక విద్యుత్ కార్యాలయం ఏడి కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గం లోని వైఎస్ఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.