రైతు శ్రీనివాసులకు న్యాయం చేయాలి
1 min readఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యన్న
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: మండలం ఎర్రకోట గ్రామంలో చాకలి శ్రీనివాసరావు రైతు మూడెకరాల మిరప పంటను దగ్ధం చేసిన దుండగులను అరెస్టు చేసి ,రైతుకు నష్టపరిహారం అందించాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యన్న డిమాండ్ చేశారు. బుధవారం నాడు స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని అఖిలభారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సత్యన్న మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో చాకలి శ్రీనివాసులు అన్న రైతు మూడెకరాల మిరప పంట సాగు చేయడం జరిగింది. మొదటి దశ పంట కోయగా ఎకరాకు నాలుగు క్వింటాల్ చొప్పున దిగుబడి వచ్చిందని తెలిపారు. సెయింట్ జోన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా కళ్లెం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఎండిన మిరప పంటను సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయం వరకు కాపలా ఉన్న శ్రీనివాసులు భోజనం కి వెళ్లిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఎండిన మిరప పంటకు పెట్రోల్ పోసి నిప్పు అంటీంచారని తెలిపారు. రైతుకు సమాచారం అందిన వెంటనే రైతు వెళ్లి చూసేసరికి మిర్చి కాలి బూడిదైందని తెలిపారు. అప్పు చేసి పండించిన రైతు తీవ్ర ఆవేదనకు గురి అయినట్టు తెలిపారు. కావున అధికారులు తక్షణమే స్పందించి రైతు శ్రీనివాసులు పంట నిప్పు పెట్టిన వ్యక్తులను విచారణ చేపట్టి తీవ్ర చర్యలు తీసుకోవాలని, రైతుకు నష్టపరిహారం కింద ఎకరాకు రెండు లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐ. ఎఫ్.టి.యు నాయకులు బాలరాజు,బాబు,సురేష్, ఎల్లప్ప,పెద్దారెడ్డి,నరసింహ రెడ్డి,రాజు,తాయన్న, నరసింహులు మరియు తదితరులు పాల్గొన్నారు.