PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచండి

1 min read

ప్రభుత్వ మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందించండి

విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించండి

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలోని 86 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వసతి గృహాల సంక్షేమ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఎస్సీ, బిసి రెసిడెన్షియల్, మైనారిటీ రెసిడెన్షియల్, గురుకులాల అధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో పిల్లలను చదివించేందుకు పంపిస్తున్నారని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, మంచి అలవాట్లపై అవగాహన కల్పించడం, విద్యాబుద్ధులు నేర్పించడంపై సంక్షేమ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. గతంలో తాను కొన్ని వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశానని అపరిశుభ్ర వాతావరణం, మెనూ ప్రకారం ఆహార పదార్థాలు లేకపోవడం, టాయిలెట్లు పరిశుభ్రంగా లేకపోవడం, కొన్ని చోట్ల టాయిలెట్లే లేకపోవడం గమనించానని… అత్యంత దయనీయ పరిస్థితులలో వసతి గృహాలు నెలకొన్నాయన్నారు. హాస్టలల్లో ఉన్న వసతులతోనే  పరిశుభ్రంగా వుంచడంతో పాటు కనీస మౌలిక వసతుల ఏర్పాటుపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలని… ఇందులో తేడాలోస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. మరుగుదొడ్లు, టాయిలెట్లను శుభ్రంగా ఉంచడంతోపాటు పారిశుద్ధ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు చదువులో నైపుణ్య మెళుకువలను పెంపొందించి ఉత్తీర్ణత శాంతాన్ని పెంచేందుకు కృషి చేయాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాలలో ప్రహరీ గోడలు, ఆర్వో ప్లాంట్లు, సివిల్ వర్క్ లు , పాత బిల్డింగులు, స్టాప్ క్వాటర్స్ లేవని రకరకాల సమస్యలు చెబుతున్నారని ఇందుకు సంబంధించిన దస్త్రాలు గత నాలుగు నెలల నుండి ఒక ప్రతిపాదన కూడా కలెక్టరేట్ నుండి  ప్రధాన కార్యాలయాలకు వెళ్లలేదని తెలియజేస్తూ సంబంధిత సమస్యల ప్రతిపాదనలను మూడు రోజులలో తనకు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న సిఎస్ఆర్ నిధులతో త్రాగునీటి వసతి, టాయిలెట్ల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి వసతులు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, బిసి వెల్ఫేర్ అధికారి ముస్తక్ అహమ్మద్, ఐటిడిఎ పిఓ వెంకట శివప్రసాద్, బిసి రెసిడెన్షియల్ వెల్ఫేర్ కన్వీనర్ ఫ్లోరా, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి, అన్ని ప్రభుత్వ వసతి గృహాల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *