ఉచిత సిలెండర్ల పథకంతో మహిళల బతుకుల్లో దీప కాంతులు
1 min readజిల్లాలో 4.75 లక్షల కుటుంబాలకు లబ్దిచేకూరుస్తున్న దీపం-2 పధకం
48 గంటల వ్యవధిలో లబ్దిదారుల బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: మహిళల బతుకుల్లో దీప కాంతులు నింపే దీపం.2 పథకం బృహత్తర కార్యక్రమం ద్వారా జిల్లాలో 4.75 లక్షల కుటుంబాలకు లబ్దిచేకూరుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. జిల్లాలో 6,53,815 లక్షల గ్యాస్ కనెక్షన్లు 4,75,723 మంది లబ్దిదారులను గుర్తించి వారికి సిలిండర్లు అందించడం జరుగుతుందన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లలో భాగంగా తొలి గ్యాస్ సిలిండరును మార్చి 31, 2025 లోపు బుక్ చేసుకున్న వారు గ్యాస్ సిలిండర్ ధరను లబ్ధిదారులు డెలివరీ సమయంలో తమ గ్యాస్ ఏజెన్సీకి చెల్లిస్తే… ఆ సొమ్ము 48 గంటల వ్యవధిలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని నవంబరు, 1నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో నూతనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతికొద్ది నెలలోనే దీపం 2 పథకం అమలుచేయడంతో రాష్ట్రంలోని వనితా లోకానికి ఆనందానికి అవధులు లేవు, కట్టెల పొయ్యిలతో మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 1996లోనే ద్వారా సంఘాల్లో ఉన్న మహిళలను ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించి కొత్త అధ్యాయానికి నాంది పలికారు. నేడు నాల్గోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ దీపం పథకం కింద బియ్యం కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ ఉన్న మహిళల లబ్ధిదారులందరిని అర్హులుగా చేసింది. నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్న బియ్యం కార్డుదారులు, ప్రభుత్వ ఉద్యోగం, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, 10ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగినవారు, సగటున 6 నెలలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు నమోదు అయ్యే లబ్ధిదారులు ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దీపం2కి అనర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీపకాంతి సంపదకీ, జ్ఞానానికీ, సంతోషానికీ, సద్భావాలకీ ప్రతీక నిలుస్తుంది. రోజు కూలీ పనులు చేసుకుంటూ బతుకులు సాగించే గ్రామీణ మహిళలు.. పట్టణ ప్రాంతాల్లో వివిధ వ్యాపార సంస్థలలో పని చేసుకుంటూ అద్దె గృహాల్లో చాలీ చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్న మహిళల జీవితాల్లో ఈ దీపం 2 పథకం చీకట్లు తొలగిపోయి.. వెలుగులు తీసుకురావడం చన్నీళ్ళకు వేడి నీళ్లు తోడుగా గృహిణిలు భావించారు.
4,75,723 కుటుంబాలకు లబ్ధి
ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్ రాఘవపురంలో నవంబర్ 1న జిల్లాస్థాయిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ , రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, పలువురు ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభమైన ఈ దీపం2 పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 4,75,723 మంది లబ్దిదారులకు మేలు జరిగింది. గ్యాస్ బుక్ చేసుకున్నలబ్ధిదారులందరికీ 48గంటల లోపే రూ.876లు తమ బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ పి జి కనెక్షన్ ఉన్నబియ్యం కార్డులందరూ ఈ పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పొందేలా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్నఇబ్బందులను టోల్ ఫ్రీ నెంబర్ 1967, పీజీఆర్ఎస్ ల ద్వారా వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను ఎప్పటికప్పుడు జిల్లా అధికార యంత్రాంగం పరిష్కరిస్తూ ముందుకు సాగుతుంది.
దీపం-2 పధకంపై పలువురు లబ్దిదారుల అభిప్రాయాలు
ద్వారకాతిరుమలకు చెందిన అందుగుల చంద్రమ్మ మాట్లాడుతూ నాలాంటి బడుగు జీవితాలకు దీపం2 పథకం ఎంతో ఆసరానిచ్చిందన్నారు. నాలాంటి బడుగు జీవితాలకు దీపం-2 పధకం ఎంతో ఆసరానిచ్చిందన్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చిన 48 గుంటల్లోనే నా అకౌంట్ లో 876 రూపాయలు జమ అయినట్లు నా సెల్ ఫోన్ కు సందేశం వచ్చిందన్నారు. ద్వారకాతిరుమలకు చెందిన పొడుగుల పాప మాట్లాడుతూ దీపం-2 పధకం తమలాంటి మధ్యతరగతి కుటుంబాలకు వరం లాంటిదన్నారు. గృహిణిలైన మేము సిలిండర్ బుక్ చేసిన 48 గంటల్లోనే మా ఖాతాలో డబ్బులు జమ అవ్వుతుండడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. ఏలూరుకు చెందిన సయ్యద్ సైదాని మాట్లాడుతూ దీపం-2 పధకం తమలాంటి పేదలకు ఎంతో ఆసరాగా ఉందన్నారు. అయితే నేరుగా ఉచితంగా ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సిలిండర్ డెలివరీ సమయంలో డబ్బులు చెల్లించకుండా సిలిండరు ఉచితంగా అందిస్తే మరింత ఊరటనిస్తుందన్నారు.