పోలీసుల అప్రజాస్వామ్య చర్యలను నిరసిస్తూ న్యాయవాదుల ఆందోళన…
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ప్రధాన రహదారిపై ధర్నా… స్తంభించినట్రాఫిక్. పల్లె వెలుగు, పత్తికొండ… అనంతపురం లో సీనియర్ న్యాయవాది బీవీ శేషాద్రి మృతికి కారకులైన త్రీ టౌన్ సీఐ, పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసి, వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, ప్రధాన కార్యదర్శి మహేష్, సీనియర్ న్యాయవాదులు కారప్ప, మైరాముడు, వెంకట్రాముడు, సత్యనారాయణ, కృష్ణయ్య, మల్లికార్జున, రమేష్ బాబు, నరసింహయ్య, బాలభాష, దామోదరఆచారి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో న్యాయవాదుల పట్ల పోలీసు అధికారుల అనుచిత ప్రవర్తన, అప్రజాస్వామ్య చర్యలను ఖండిస్తూ కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం పత్తికొండలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి, స్థానిక ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. గంటకు పైగా ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగావారుమాట్లాడుతూ,అనంతపురం త్రీ టౌన్ పోలీసు అధికారులు సివిల్ వ్యవహారంలో కలుగజేసుకుని, సీనియర్ న్యాయవాది బీవీ శేషాద్రి పట్ల అనుచితంగా ప్రవర్తించి, బెదిరించడంతో ఆందోళనకు గురి అయిన న్యాయవాది గుండెపోటుతో పోలీసు స్టేషన్ లోనే ప్రాణాలు కోల్పోయారన్నారు. ఘటన తర్వాత కూడా పోలీసు అధికారులు అమానవీయంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టాలను అమలు చేయాల్సిన పోలిసులు వాటిని బేఖాతరు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులు అయిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన సీనియర్ న్యాయవాది బీవీ శేషాద్రి కుటుంబానికి ప్రభుత్వం ₹. కోటి రూపాయలు ఆర్థిక సాయం అందించాలన్నారు.