వైసీపీని ఓడిద్దాం, దళిత బహుజన హక్కులను రక్షిద్దాం..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గడిచిన 5 ఏళ్ల పాలనలో దళిత బహుజన కులాల రాజ్యాంగ హక్కులను కాలరాసిన వైసిపి పార్టీని ఓడించేందుకు దళిత బహుజనులు సన్నద్ధం కావాలని దళిత బహుజన్ ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్య రావు పిలుపునిచ్చారు. సోమవారం కర్నూలులో జరిగిన విలేకరుల సమావేశంలో మేళం భాగ్య రావు పాల్గొని ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు చెందిన 27 పథకాలను రద్దుచేసి దళితులకు తీరని ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. జగన్ పార్టీకి వ్యతిరేకంగా బహుజనులు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.నవరత్నాలు అనేవి అసలు పథకాలు కానే కాదని అవి కేవలము పంపిణీ కార్యక్రమాలు మాత్రమేనని, దళితులకు గతంలో ఉన్న పథకాలను రద్దుచేసి జగన్ మోసం చేశాడని ఆయన వివరించారు. ప్రజా ఆరోగ్య హానికరమైన మత్తు పదార్థాలు మద్యము ప్రభుత్వాలు అమ్మకాలు చేయడము రాజ్యాంగ విరుద్ధమని మద్యం అమ్మకాలు జగన్ ప్రభుత్వం చేయటము ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి దళిత బహుజన మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.కడప రెడ్డన్న మాట్లాడుతూ దళితులకు మాల, మాదిగ, రెల్లి మూడు కార్పొరేషన్లు పెట్టి సున్నా బడ్జెట్ పెట్టారన్నారు. అందుకే సున్నా చుట్టి జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎలక్షన్లో ఓడిస్తామన్నారు. చిరువేళ్ళ సంధ్యారాణి మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ఆశచూపి మోసపూరితమైన కుట్రలు పన్నుతున్న వై.ఎస్ జగన్ మోసాలకు తాము బలికాబోమన్నారు. బహుజనులు అందరూ ఈ సారి తిరగబడి ఎలక్షన్లలో తమ సత్తా చూపుతారన్నారు. ఈ కార్యక్రమంలో మధు, ఎనుముల రాజకుమార్, విజయలక్ష్మి పాల్గొన్నారు.