పరిశ్రమల కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం…
1 min readపరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఐదేళ్లలో రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఆయన మున్సిపాలిటీ విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ.. దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలకు గుజరాత్ రాష్ట్రమే గుర్తుకు వస్తుందన్నారు. రానున్న ఐదేళ్లలో మన రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనువైన పరిస్థితులు పూర్తి స్థాయిలో తీసుకొస్తామన్నారు. పరిశ్రమల స్థాపనలో ఏపీని గుజరాత్‌తో సమానంగా తీసుకెళతామని చెప్పారు. 21 రోజుల్లో సింగిల్ విండో క్లియరెన్స్ కు చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామికవేత్తగా తనకు ఉన్న అనుభవంతో నిరంతరం కష్టపడి పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా ముందుకు వెళతానన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ హామీ నెరవేరాలంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు తనపై పెద్ద బాధ్యతను పెట్టారన్నారు. ఐదేళ్లలో తన పనితీరుతో చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఇక కర్నూలు నగరంలో ఉన్న సమస్యలు అన్ని పరిష్కరించి.. నగరాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళతామన్నారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనరు భార్గవ్ తేజ, అధికారులు పాల్గొన్నారు.