పట్టణ ప్రాంతంలో పరిశ్రమలు – ఉపాధికై ఉద్యమిద్దాం
1 min readఎక్స్టెన్షన్ కాలనీలలో తాగేందుకు నీళ్లను కూడా ఇవ్వని పాలకుల విధానాలను ఎండగడదాం
ఘనంగా ప్రారంభమైన సిపిఎం నగర 3వ మహాసభ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా కేంద్రంగా ఉన్న కర్నూలు నగరం లో ఏటేటా పెరుగుతున్న జనాభాతో పాటు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉందని, ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఎక్స్టెన్షన్ కాలనీలకు కనీసం మంచినీళ్లను కూడా సరిగా సరఫరా చేయని పాలకుల విధానాలను ఎండగడదామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం కర్నూల్ నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్ లో జరుపుతున్న సిపిఎం కర్నూల్ న్యూ సిటీ మూడవ మహాసభకు ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు మహాసభ ప్రారంభ సూచికగా సిపిఎం పతాకాన్ని సిపిఎం న్యూ సిటీ కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా ఎగరవేశారు. నగర నాయకులు ఆర్ నరసింహులు, కె అరుణమ్మ, శంకర్ ల అధ్యక్షతన జరిగిన మహాసభను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మల మాట్లాడుతూ రాయలసీమ ముఖద్వారంగా కర్నూల్ నగరం ఉన్నప్పటికీ ఉపాధి లేక యువత నిరుద్యోగంతో అల్లాడుతున్నారన్నారు. నగరం నుండి చదువుకున్న యువత ఉద్యోగాల కోసం బొంబాయి, బెంగళూరు, హైదరాబాద్, మద్రాసు లాంటి ప్రాంతాలకు వలసలు పోతున్న పరిస్థితి ఉందన్నారు. చదువుకోని యువత ఉపాధి లేక పెరుగుతున్న ధరలతో కొని తినలేని పరిస్థితి దాపురించిందన్నారు. నగర పరిధిలో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉన్న ఉపాధి అవకాశాలు తక్కువేనన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి అయినా ప్రత్యేకంగా దృష్టి పెట్టి కొత్త పరిశ్రమలను జిల్లాకు తీసుకురావడంతో పాటు ఉపాధి అవకాశాలను సృష్టించాలన్నారు. పెరుగుతున్న కొత్త కాలనీలలో లక్షలు వెచ్చించి స్థలాలు కొని ఇల్లు కట్టుకున్న వారికి మౌలిక సౌకర్యాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. చివరికి తాగేందుకు మంచినీళ్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. సిపిఎం నగర కమిటీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల కారణంగా ప్రజలు మోస్తున్న భారాలకు వ్యతిరేకంగా ఉద్యమించడంతోపాటు, ప్రజలకు ఉపాధి, గృహ సౌకర్యం, మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్యం, నాణ్యమైన విద్య కోసం నికరమైన పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.