PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకి మహర్షి బాటలో నడుద్దాం

1 min read

బడుగు బలహీన వర్గాలకు టీడీపీ అండగా నిలుస్తుంది

వాల్మీకి భవన నిర్మాణానికి త్వరలోనే పనులు ప్రారంభిస్తాం

వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి వెల్లడి

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  పట్టణంలో ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షి చూపిన బాటలో నడుద్దామని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకొని గురువారం ఎమ్మిగనూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న వాల్మీకి భవన స్థలంలో వాల్మీకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి వాల్మీకులను ఉద్దేశించి  మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం మానవాళికి మార్గ నిర్దేశం అన్నారు. అధర్మం నుంచి ధర్మం, అసత్యం నుంచి సత్యం వైపు సమాజాన్ని నడిపించాలన్నదే వాల్మీకి మహర్షి ఆశయమన్నారు. బడుగు బలహీన వర్గాలకు టీడీపీ పార్టీ ఎల్లప్పుడు అండగా నిలుస్తూ వస్తుందన్నారు. గత 40 ఏళ్లుగా నా తండ్రి మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి బీసీలకు అండగా నిలుస్తూ, మీ ఆశీస్సులతో ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిచారన్నారు. ఆయన తనయుడుగా తనను కూడా ప్రజల ఆశీర్వాదంతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించడం మీరందరికి కృతజ్ఞతలు అన్నారు. గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి వాల్మీకి భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారని గుర్తు చేశారు. ఈ స్థలంలోని ఈరోజు వాల్మీకి జయంతిని జరుపుకుంటున్నామని, 2014లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భవన నిర్మాణానికి 65 లక్షల నిధులు తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. కూటమి పాలనలో వాల్మీకి భవన నిర్మాణానికి వెనక్కి వెళ్లిన నిధులను తీసుకొచ్చి  అతి త్వరలోనే వాల్మీకి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పనులు ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెద్దల ఆశీస్సులతో జరిగే కార్యక్రమాలు విజయవంతం అవుతాయన్నారు. అన్ని మతాలను గౌరవించాలన్నదే దేశంలో ఉన్న ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అనంతరం విద్యార్థినిలకు పుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే వాల్మీకులందరూ  ఎమ్మెల్యేకు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వాల్మీకి నాయకులు  సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author