రాయలసీమలో తొలిసారిగా “లంగ్ టాక్స్”
1 min readఊపిరితిత్తుల సమస్యలపై వైద్యనిపుణుల విస్తృత చర్చ
కిమ్స్ సవీరా ఆస్పత్రిలో ఒక రోజు సదస్సు
ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్
కర్ణాటక, ఏపీల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన వైద్యులు
అత్యాధునిక చికిత్సా విధానాలపై అవగాహన
పల్లెవెలుగు వెబ్ అనంతపురం: రాయలసీమ ప్రాంతంలో తొలిసారిగా ఊపిరితిత్తుల సమస్యలపై వైద్యనిపుణుల్లో అవగాహన కోసం “లంగ్ టాక్స్” అనే సదస్సును నిర్వహించారు. నగరంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి ఆధ్వర్యంలో నగరంలోని అలెగ్జాండర్ లగ్జరీ హోటల్‌లోని సప్తగిరి సర్కిల్లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పలువురు వైద్యులు, వైద్యవిద్యార్థులు, పీజీ విద్యార్థులు తదితరులు హాజరయ్యారు. సదస్సును జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల డీఎంహెచ్ఓలు, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ఊపిరితిత్తుల్లో వచ్చే పలు రకాల సమస్యలు, వాటికి నిర్ధారణ పరీక్షలు, చికిత్సా విధానాలపై ఇందులో విస్తృతంగా చర్చించారు. ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ), క్షయ (టీబీ), ఊపిరితిత్తుల క్యాన్సర్లు తదితర సమస్యలు ఎందుకు వస్తాయి, వాటి నిర్ధారణకు ఎలాంటి పరీక్షలు ఉన్నాయనే అంశంపై జనరల్ ఫిజిషియన్లు, పల్మనాలజిస్టులు, ఎనస్థీషియాలజిస్టులు, క్రిటికల్ కేర్ విభాగం నిపుణులు, పీజీ విద్యార్థులు తదితరులకు అవగాహన కల్పించారు. ఇలాంటి సంక్లిష్టమైన సమస్యలు ఉన్నప్పుడు ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటే వెంటిలేటర్ అమర్చడంలో ఆధునిక విధానాలు, ఎక్మో ఎప్పుడు, ఎలా ఎన్నాళ్లు ఉపయోగించాలనే విషయాలు చర్చించారు. ఇందులో ఫ్లెక్సిబుల్, రిజిడ్ బ్రాంకోస్కొపీ, ఎండోబ్రాంకియల్ అల్ట్రా సౌండ్ (ఈబీయూఎస్)- రేడియల్, లీనియర్, క్రయోథెరపీ, థొరాకోస్కొపీ, వెంటిలేటర్ స్కాలర్ ఇంటర్‌ప్రెటేషన్ తదితర విధానాలను ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, కిమ్స్ సవీరా ఆస్పత్రి ఎండీ ఎస్‌వీ కిశోర్‌రెడ్డిల మార్గదర్శకత్వంలో ఈ సదస్సు జరిగింది. హైదరాబాద్‌లోకి కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పల్మనాలజిస్టు డాక్టర్ ఎన్.శుభకర్, కిమ్స్ సవీరా ఆస్పత్రికి చెందిన డాక్టర్ యశోవర్ధన్ మంగిశెట్టి, డాక్టర్ రవిశంకర్ తదితరులు వివిధ వైద్యవిధానాలు, ఊపిరితిత్తుల సమస్యలపై మాట్లాడారు. సాధారణంగా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చాయంటే హైదరాబాద్ లేదా బెంగళూరుకే చికిత్సల కోసం వెళ్తారని, కానీ ఆయా నగరాలకు దీటుగా రాయలసీమలోని అనంతపురంలో కూడా అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని ఈ సదస్సు ద్వారా వైద్యులకు కూడా తెలియజేశారు.