ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చాలి…
1 min readఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు భరోసానిచ్చి అవగాహన కల్పించాలి
యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ 3 నెలలు తీసుకుంటే పెన్షన్ మంజూరు
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సంబంధిత పేషెంట్లకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ మెరుగైన చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వైద్యాధికారులను సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవ సందర్భంగా ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన భారీ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. సర్వజన వైద్యశాల నుండి ఎస్బిఐ కాలనీ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ తో పాటు డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డా.జఫ్రూళ్ల, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, పారామెడికల్ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, వివిధ కాలేజీల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో 84 ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయని ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకుని ఏఆర్టి మందులను వినియోగించాలన్నారు. యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) అనేది HIV చికిత్సకు ఉపయోగించే మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండన్నారు. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తల్లి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తురాలైన బిడ్డకు సోకకుండా డాక్టర్లు, సంబంధిత వైద్య సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్లలో వ్యాధిగ్రస్తులకు అన్ని మందులు ఇస్తూ ఇతర వ్యక్తులు సోకకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ తెలిపారు. మూడు నెలలు నిరంతరాయంగా యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ తీసుకున్నట్లయితే సంబంధిత వ్యక్తులకు పెన్షన్ కూడా మంజూరు చేస్తున్నామన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే గుర్తించి ప్రతిపాదించాలని వైద్య శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.