మీ ఐదేళ్ల భవిష్యత్తు కోసం టిడిపిని గెలిపించండి..
1 min readకర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వివిధ వార్డుల నాయకులు, కార్యకర్తలు
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఐదేళ్ల భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. మౌర్య ఇన్‌లోని ఆయన కార్యాలయంలో వివిధ వార్డులకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భరత్ వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల పాలనలో అన్ని ధరలు పెరిగిపోయి ప్రజలు జీవనం సాగించలేని పరిస్థితి వచ్చేసిందన్నారు. కరెంట్ చార్జీలు, మున్సిపాలిటీ పన్నులు, నిత్యవసర సరుకుల ధరల భారం ప్రజలు భరించలేకపోతున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజలపై భారాలు పడకుండా నియంత్రిస్తామని చెప్పారు. ఇక కర్నూల్ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.. కులం, మతం పేరు చెప్పి ఓట్లు అడిగేవారిని నమ్మొద్దని ప్రజలకు వివరించాలని ఆయన నాయకులకు సూచించారు. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లు మళ్లీ చేయొద్దన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నందుకు టిడిపికి ఓటు వేయొద్దని ముస్లింల ఓట్లు పొందేందుకు వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లు ఆయన మండిపడ్డారు. అయితే బీజేపీతో టిడిపి కలిసి ఉన్నప్పుడు ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయని.. వైసీపీ ప్రభుత్వంలోనే ముస్లింల పథకాలు తీసివేశారని తెలిపారు. తనను గెలిపిస్తే కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. నగరం రూపురేఖలు మారుస్తానని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు వేయాలని ఆయన కోరారు.వైసీపీని వీడి టిడిపిలో చేరిన వారిలో 23వ వార్డు నుండి మద్దిలేటి, నరసింహులు, గోపాల్, పెద్ద గోపాల్, లక్ష్మన్న, సాయి కుమార్, భరత్, 47వ వార్డు ధర్మపేటకు చెందిన తిమ్మప్ప, సల్మాన్, లక్ష్మన్న, 6వ వార్డు గడ్డాకు చెందిన గౌస్ పీర్, మోయిన్, విజయ్, అబ్దుల్లా, 12వ వార్డు బాపూజీ నగర్‌కు చెందిన అభినయ్ కుమార్, మెహబూబ్, ఉపేంద్ర, జలీల్, ఖాసీం, తదితరులు ఉన్నారు.