71 వ అఖిలభారత సహకార వారోత్సవాలను విజయవంతం చేయండి
1 min readవికసిత్ భారత్ నిర్మాణ్ లో సహకార సంఘాల పాత్ర
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: వికసిత్ భారత నిర్మాణ్ లో భాగంగా జిల్లాలో 71 వ అఖిలభారత సహకార వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సహకార శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఛాంబర్ లో అఖిలభారత సహకార వారోత్సవాల వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా సహకార అధికారి వెంకటసుబ్బయ్య, డ్వామా పిడి జనార్దన్ రెడ్డి, ఇతర సహకార శాఖ అధికారులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ మెరుగైన వికసిత్ భారత్ నిర్మాణంలో భాగంగా వివిధ రంగాలలో సహకార రంగాల అభివృద్ధి, సంఘాల విజయ గాధలను తెలియపరిచే లక్ష్యంతో సహకార వారోత్సవాలను ఈనెల 14 నుండి 20 తేది వరకు నిర్వహిస్తూ విజయవంతం చేయాలన్నారు. గత సంవత్సరంలో జరిగిన అభివృద్ధిని సమీక్షించుకొని భవిష్యత్తుకు కావలసిన ప్రణాళికలను తయారుచేసి అమలు పరచడం, సహకార వ్యవస్థలో జరిగే మార్పులను, నూతన చట్టాలను సభ్యులకు తెలియజేస్తూ ప్రజలలో సహకార, ఉద్యమం పట్ల నమ్మకాన్ని, ఆసక్తిని కలగజేయడం సహకార వారోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు.ఈ నెల 14 వ తేది సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం, 15వ తేదీ సహకార రంగం నందు నూతన ఆవిష్కరణలు, సాంకేతిక సుపరిపాలన…16వ తేదీ వ్యవస్థాపక, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి ప్రోత్సహించడంలో సహకార సంఘాల పాత్ర…17వ తేదీ సహకార సంస్థలను వ్యాపార అభివృద్ధి స్థలంగా మార్చడం, 18వ తేదీ సహకార సంఘాల మధ్య సహకారం పెంపొందించడం, 19వ తేదీ మహిళ, యువత, బలహీన వర్గాల సహకార రంగం… 20వ తేదీ సుస్థిర అభివృద్ధి సాధించుటకు మరియు ప్రపంచ ఆవిష్కరణ దిశగా తీసుకువెళ్లడంలో సహకార సంఘాల పాత్ర… తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.