మంగళగిరి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ మంత్రి లోకేష్
1 min readరాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళగిరి శాలువా బహుకరణ
మంత్రి లోకేష్ బాటలోనే భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి
పల్లెవెలుగు వెబ్ అమరావతి: మంగళగిరి చేనేతలంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. చేనేతలు తమ ఆత్మబంధువులని చెప్పే మంత్రి నారా లోకేష్ కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో అభిమానాన్ని చూపుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే మంగళగిరి చేనేతలకు మంత్రి నారా లోకేష్ తోపాటు ఆయన భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి అనధికార బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ మంగళగిరి చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిమ్స్ లో కాన్వకేషన్ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేతలు నేసిన శాలువను ఆమెకు బహుకరించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులను కలిసినపుడు కూడా ఆయన మంగళగిరి శాలువాలతోనే వారిని సత్కరించారు. లోకేష్ భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి మంగళగిరి చీరలను ధరిస్తూ వాటి ప్రాశస్త్యాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇదిలావుండగా ప్రతిపక్షంలో ఉండగానే మంత్రి లోకేష్ మంగళగిరిలో వీవర్స్ శాలను ఏర్పాటుచేసి, ఇక్కడి చేనేతలు తయారుచేసిన వస్త్రాల మార్కెటింగ్ కోసం టాటా టనేరియాతో అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేశారు. పతనావస్థకు చేరుతున్న మంగళగిరి చేనేతను పునరుజ్జీవింప జేసేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి మంగళగిరిలోని చేనేతలు మురిసిపోతున్నారు.