మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు ఎఫ్, అబ్దుల్ హమీద్ కార్యదర్శిN, సుభాన్ మాట్లాడుతూ భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 నవంబర్ 11న మక్కాలో జన్మించారు. తల్లి ఆలియా, తండ్రి మౌలానా ఖైరుద్దీన్. ఆజాద్ అసలు పేరు అబుల్ కలాం మొహిద్దీన్ ఖైరుద్దీన్. చిన్ననాటనే అరబిక్, పర్షియన్, టర్కిష్, ఉర్దూ భాషలలో ఆజాద్ మంచి పాండిత్యం సంపాదించారు. ఆయన తన 12వ ఏట ‘నైరంగ్-ఎ-ఆలం’ పత్రికను వెలువరించారు. ఆయన 13వ ఏటన అద్భుత సాహిత్య విమర్శను సృజియించి ‘విద్యాగని, సలక్షణ శోభితుడు, మహాకవి, సాటిలేని విద్వాంసుడు’గా ప్రశంసలందుకున్నారు. 1904లో జరిగిన అఖిల భారత ముస్లిం విద్యాసదస్సులో, అఖిల భారత ముస్లిం పత్రికా సంపాదకుల సమావేశాల్లో పాల్గొనటంతో ఆజాద్ ప్రజా జీవితంలో ప్రవేశించారు. తొలుత ముస్లిం లీగ్ ఆలోచనలతో బయలుదేరిన ఆయన పరాయి పాలనకు స్వస్తి పలకాలంటే సాయుధ పోరాటమే శరణ్యమని భావించి పలు విప్లవ సంఘాలను ఏర్పాటు చేశారు. 1920 జనవరిలో మహాత్మాగాంధిని కలుసుకున్నాక తన విప్లవ బాటను వీడి అహింసా మార్గం చేపట్టారు. ఖిలాఫత్-సహాయనిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనటం ద్వారా జాతీయోద్యమంలో ప్రవేశించారు. అబుల్ కలాం పలు గ్రంథాలను రాసి ప్రచురించి మహకవిగా, పండితునిగా, అద్భుత మేథాశక్తిగల ధార్మికవేత్తగా ఎనలేని ఖ్యాతిని ఆర్జించారు. జాతీయోద్యమం దిశగా ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు’అల్ హిలాల్’,’అల్ బలాగ్’ లాంటి ఉర్దూ పత్రికలను వెలువరించారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని కలవరపెట్టిన ఈ పత్రికలు పలుమార్లు నిషేధానికి గురయ్యాయి. ఈ ఉద్యమాల సందర్భంగా ఆరంభమైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జైలు శిక్షల జీవితం పదేండ్ల ఏడు మాసాల పాటు దేశంలోని వివిధ జైళ్ళలో సాగింది. 1923లో ఢిల్లీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు 35 సంవత్సరాల వయస్సులో మౌలానా ఆజాద్ అధ్యక్షత చేపట్టారు. 1927లో కాంగ్రెస్- ముస్లిం లీగ్‌ల మధ్య ఏర్పడిన సయోధ్యకు మౌలానా తోడ్పడ్డారు. 1939లో మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టి 1948లో స్వాతంత్య్రం లభించేంత వరకు ఆ పదవి నిర్వహించిన మౌలానా ఆజాద్ చరిత్ర సృష్టించారు. ఆయన చివరివరకు వేర్పాటువాదాన్ని వ్యతిరేకించారు. హిందూ-ముస్లింల మధ్య ఐక్యత కోసం తీవ్రంగా కృషి చేస్నున్న మౌలానా ‘స్వరాజ్యం’ సాధన కంటే ఈ దేశంలోని హిందూ-ముస్లింల ఐక్యతను సాధించడం అత్యంత ప్రధానమని ప్రకటించారు. స్వతంత్ర భారతదేశంలో గాంధీజీ ఒత్తిడి విూద 1947 జనవరి 15న ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విద్యాశాఖ మంత్రిగా విలక్షణమైన విద్యా ప్రణాళికలను అమలుచేశారు. ఈనాడు ఆగ్రగామిగా వెలుగొందుతున్న అకడమిక్-సాంకేతిక విద్యా సంస్థలకు మౌలానా ఆజాద్ పునాదులు వేశారు. అటు స్వాతంత్య్రోద్యమంలో, ఇటు స్వతంత్ర భారతదేశంలో విశిష్ట పాత్రలను నిర్వహించి, చరమాంకం వరకు హిందూ-ముస్లింల ఐక్యతను ప్రగాఢంగా వాంఛిస్తూ సాగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1958 ఫిబ్రవరి 22న కన్నుమూశారు.ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ కమిటీ సభ్యులు కే, సలాం, కె ,అబ్దుల్ రెహ్మాన్, ఎం ,హఫీజ్, బి , అల్లా బకాష్, చికెన్ బక్షి, ఎస్,ఎం,డి, షఫీ, టి ,భాష, ఎం ,రహమతుల్లా, వాజిద్, తదితరులు పాల్గొన్నారు.