PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేయ‌ర్ బీ.వై రామ‌య్య క‌మీష‌న్లు తీసుకోవ‌డం త‌ప్ప అభివృద్ధి చేసింది శూన్యం

1 min read

పారిశుధ్య కార్మికుల నియామ‌కమంతా పారద‌ర్శకంగానే చేశాము

మంత్రి టి.జి భ‌ర‌త్ గురించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే మేయర్ అవినీతి చిట్టా బ‌య‌ట‌పెడ‌తాం

విలేక‌రుల సమావేశంలో మండిప‌డిన తెదేపా కార్పొరేట‌ర్లు, సీనియ‌ర్ నాయ‌కులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు న‌గ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్ బీ.వై రామ‌య్య క‌మీష‌న్లు తీసుకోవ‌డం త‌ప్ప అభివృద్ధి చేయ‌లేద‌ని తెలుగుదేశం పార్టీ కార్పొరేట‌ర్లు, సీనియ‌ర్ నాయ‌కులు మండిప‌డ్డారు. శ‌నివారం మున్సిప‌ల్ కార్యాల‌యం ప్రాంగ‌ణంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేట‌ర్లు విలేక‌రులతో  మాట్లాడారు. మురుగు కాలువ‌లు శుభ్రం చేసే కార్మికుల నియామ‌కం విష‌యంలో రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ పేరు ప్రస్తావించి మేయ‌ర్ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయ‌డంపై కొర్పొరేట‌ర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయ‌ర్‌ను ప్రజ‌లే గుర్తుప‌ట్టలేని ప‌రిస్థితి ఏర్పడింద‌ని.. మున్సిప‌ల్ ఆఫీసులో కూర్చొని సెటిల్‌మ్మెంట్లు చేయ‌డం తప్ప ఆయ‌న చేసిందేమీ లేద‌న్నారు. క‌ర్నూలును స్మార్ట్ సిటీ చేసే విధానంలో భాగంగా.. మే నెల‌తో పారిశుధ్య వ‌ర్కర్ల కాల‌ప‌రిమితి ముగిసిపోయిన నేప‌థ్యంలో వెంట‌నే కౌన్సిల్‌లో ఆమోదం పెట్టి కొత్త వారిని తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. కౌన్సిల్ ఆమోదం తెలిపిన అజెండాలో కొత్త వ‌ర్కర్లను తీసుకోవాలనే ఉంద‌ని కార్పొరేట‌ర్లు త‌మ వ‌ద్ద ఉన్న‌ ప‌త్రాలు చూపించారు. గ‌తంలో మేయ‌ర్ తీసుకున్న 180 మంది వ‌ర్కర్లను ఔట్‌సోర్సింగ్ కింద చేస్తామ‌ని మాయ‌మాట‌లు చెప్పి డ‌బ్బులు తీసుకొని ప‌నిలోకి తీసుకున్నార‌ని మండిప‌డ్డారు. ఇన్ని రోజులు అధికారంలో ఉండి కూడా ఈ వ‌ర్కర్లను ఎందుకు ఔట్‌సోర్సింగ్ కింద చేయ‌లేద‌ని ప్రశ్నించారు. పేద ప్రజ‌ల వ‌ద్ద డ‌బ్బులు తీసుకొని ఔట్‌సోర్సింగ్ కింద‌కు తీసుకోకుండా వాళ్లు రోడ్డున ప‌డే స్థితికి తీసుకొచ్చార‌ని మేయ‌ర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నియ‌మించిన వ‌ర్కర్లలో ఎవ్వరి ద‌గ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేద‌ని కార్పొరేట‌ర్లు తెలిపారు. న‌గ‌రంలో కొత్తగా చేప‌ట్టిన ప‌నుల‌కే మంత్రి టి.జి భ‌ర‌త్‌, కార్పొరేట‌ర్లం క‌లిసి శంకుస్థాప‌న‌లు చేస్తున్నాం త‌ప్ప పాత వాటికి కాద‌న్నారు. గతంలో జొహ‌రాపురం బ్రిడ్జి నిర్మాణం మొత్తం తెలుగుదేశం ప్రభుత్వ‌ హ‌యాంలో పూర్త‌యితే మొత్తం ప‌ని మీరే చేసిన‌ట్లు గొప్పలు చెప్పుకున్నార‌న్నారు. ఇక‌ ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత మేయ‌ర్ రామ‌య్యకు లేద‌న్నారు. గ‌తంలో జ‌రిగిన శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్సవాల‌కు తెలుగుదేశం పార్టీ త‌రుపున ఎన్నికైన కార్పొరేట‌ర్ల‌ను పిల‌వ‌కుండానే ప‌నులు జ‌రిపించార‌న్నారు. అప్పట్లో రోడ్లపైకి వ‌చ్చి తాము నిర‌స‌న చేప‌ట్టిన విష‌యాన్ని కార్పొరేట‌ర్లు గుర్తు చేశారు. త‌మ వార్డుల్లో ఉన్న స‌మ‌స్యల గురించి కౌన్సిల్‌లో మాట్లాడేందుకు కూడా మేయ‌ర్‌ త‌మ‌కు అవ‌కాశం ఇవ్వలేద‌ని కార్పొరేట‌ర్లు ఆవేద‌న వ్యక్తం చేశారు. మేయ‌ర్ రామ‌య్య తీరు కౌన్సిల్ మీటింగ్‌లో విచిత్రంగా ఉంటుంద‌న్నారు. వైసీపీ కార్పొరేట‌ర్లను గౌర‌వించి టిడిపి కార్పొరేట‌ర్లను ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవ‌ని చెప్పారు. టిడిపి కార్పొరేట‌ర్లు ఉన్న వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితి ఉండ‌కూడ‌ద‌నే మంత్రి టి.జి భ‌ర‌త్‌ ఆదేశాల‌తో కొత్త వ‌ర్కర్లను తీసుకున్నామ‌న్నారు.క‌రోనా స‌మ‌యంలో ప‌నిచేసిన వారిని తీసివేసి కొత్తవారికి ఎందుకు తీసుకున్నార‌ని నాయ‌కులు ప్రశ్నించారు. ఇప్పుడున్న పారిశుధ్య కార్మికుల్లో కేవ‌లం 90 మంది గురించి మాత్రమే ఇప్పుడు లేవ‌నెత్తార‌ని.. ఎందుకంటే డ‌బ్బులిచ్చి ప‌నిలో చేరిన వారిలో కొంత‌మంది వీళ్లను ప్రశ్నించ‌లేద‌ని.. మిగిలిన వారు ప్రశ్నించ‌డంతో చేసేదేమీ లేక ఇప్పుడు అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తున్నార‌న్నారు. ఇక డిప్యూటీ క‌మిష‌న‌ర్ నియామకం గురించి మేయ‌ర్ ప్రశ్నించ‌డం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం డిప్యూటీ క‌మిష‌న‌ర్‌ను ఎందుకు నియ‌మించ‌లేద‌న్నారు. వైసీపీ 5 ఏళ్లు అధికారంలో ఉండి చేసిందేమీ లేద‌న్నారు. టి.జి భ‌ర‌త్ గెలిచి మంత్రి అయిన వెంట‌నే జీర్ణించుకోలేక ఆయ‌న‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నార‌న్నారు. మంత్రి టి.జి కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడ‌టం మానుకోవాల‌ని హితవు ప‌లికారు. నోరు అదుపులో పెట్టుకోక‌పోతే మేయ‌ర్ అవినీతి చిట్టా విప్పుతామ‌ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట‌ర్లు ప‌ర‌మేష్‌, జ‌కియా అక్సారీ, ల‌తీఫ్‌, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, మాజీ కార్పొరేట‌ర్లు రామాంజ‌నేయులు, గున్నామార్క్, సుంక‌న్న‌, ఖాద‌ర్ బాషా, అకీమ్, మోయిన్ బాషా, శేషు యాద‌వ్‌, సీనియ‌ర్ నాయ‌కులు శేష‌గిరి శెట్టి, పాల్ రాజ్, ఏసు, తార‌నాథ్‌, బాలు, ఇబ్రహీం, చెన్న‌, విక్రమ్ సింగ్, చిన్నమ్మి, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి జూటూరు రవి, లక్ష్మి, మ‌నీష్‌, సురేంద్ర‌, శ్రీకాంత్, రామ‌కృష్ణ‌, హ‌రి, ఊట్ల ర‌మేష్‌, రామయ్య యాదవ్, క్రిష్ణ‌, బాలయ్య, నరసింహులు, త‌దిత‌ర ముఖ్య నాయ‌కులు, పాల్గొన్నారు.

About Author