పనిలో.. మానసిక ఆరోగ్యం..
1 min readపని చేసే చోట.. మానసిక రోగులకు ప్రాధాన్యం కల్పించండి..
- విద్యార్థులకు, ప్రజలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించండి
- మానసిక వ్యాధ్యుల వైద్య నిపుణులు డా. సుహృత్ రెడ్డి, ఆశాకిరణ్ హాస్పిటల్
- నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
కర్నూలు, పల్లెవెలుగు:ఆధునిక ప్రపంచంలో ప్రతిఒక్కరూ తమ లక్ష్య సాధనకై విశేష కృషి చేస్తున్నారని, కానీఈ పని చేసే చోట వర్కర్లు మానసిక ఆరోగ్యం దెబ్బతీసుకుంటున్నారని, అలాంటి క్రమంలో యజమానులు ఉద్యోగులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డా. సుహృత్ రెడ్డి. అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు, విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై వివరించారు. ప్రతి సంవత్సరం అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తారని, అందులో భాగంగా ఈ ఏడాది థీమ్ ‘పనిలో మానసిక ఆరోగ్యం ’ అని పేర్కొన్నారు.
మానసిక రోగులను ప్రోత్సహించండి…
కంప్యూటర్ యుగంలో శరవేగంగా డిమాండ్లు నెరవేర్చుకునేందుకు… లక్ష్యాన్ని ఛేదించేందుకు … ఉద్యోగులు, కార్మికులు అధిక ఒత్తిడికి గురవుతూ.. ఆందోళన చెందుతూ… మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంలేదని, దీంతో వారు పేలవంగా మాట్లాడటం.. ప్రవర్తించడం వంటివి చేస్తుంటారని, అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు నగరంలోని ఎన్ ఆర్ పేటలోని ఆశాకిరణ్ హాస్పిటల్ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సుహృత్ రెడ్డి. పని చేసే చోట మానసిక రోగులు ఉంటారని, వారికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
స్కూల్ డేస్ నుంచే…
విద్యార్థులకు స్కూల్ డే నుంచే మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న డా. సుహృత్ రెడ్డి…. ప్రజలకు, వ్యాపారులకు, యజమానులకు వర్కర్ల ఆరోగ్యంపై కూడా స్పష్టంగా తెలిసి ఉండాలన్నారు. ఒత్తిడి, బర్న్‌అవుట్ మరియు మానసిక ఆరోగ్య సవాళ్లు అన్ని సమయాలలో అత్యధికంగా ఉంటాయని, ఇది యజమానులు మరియు ఉద్యోగులకు ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని పెంపొందించేలా చూసుకోవాలన్నారు.