మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం..
1 min readపనిలో ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు, కార్మికులు
- వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత యజమానులదే..
- మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డా. రమేష్ బాబు
- అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
కర్నూలు, పల్లెవెలుగు:మానసిక ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మానసిక వ్యాధులు వైద్య నిపుణులు డా. రమేష్ బాబు. అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ఎన్ ఆర్ పేటలోని మానస సైకియాట్రి క్లినిక్‌లో మానసిక వ్యాధిగ్రస్తులకు, శ్రీ మతి నారాయణమ్మ, పుల్లారెడ్డి చారిట్రిస్ ట్రస్ట్‌లోని వృద్ధులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డా.రమేష్ బాబు మాట్లాడుతూ .. సమాజంలో మానసిక వ్యాధి గ్రస్తుల పట్ల కళంకం, వివక్ష చూపరాదని, వారికి వైద్య చికిత్సల ద్వారా నయం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఆధునిక ప్రపంచంలో ఉద్యోగులు, కార్మికులు, యజమానులు వారి వారి లక్ష్య సాధనకు కృషి చేయడం అభినందనీయమన్నారు. కానీ పనిలో ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు, కార్మికులను ప్రోత్సహించాల్సిన బాధ్యత యజమానులదేనన్నారు. పని చేసే వారు మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సు అనంతరం డా. రమేష్ బాబు దృష్టికి కొందరు తమ మానసిక సమస్యలను వివరించారు.
అందులో కొన్ని…
- డిప్రెసివ్ డిసార్డర్ అనే మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఉపాధ్యాయురాలు సీనియర్ ఉద్యోగి లైంగిక వెకిలి చేష్టలతో విసిగిపోయి.. మానసిక గాయానికి గురైంది. కానీ ఆమె తన కుటుంబ సభ్యులు మరియు ఉన్నతాధికారుల మద్దతు సహాయ సహకారాలతో ఆ గాయం నుండి బయటపడింది.
- యువకుడైన డిప్రెస్సివ్ పేషంటు తన పై అధికారి అహంకారంతో దుర్భాషల మూలంగా తీవ్రమైన మనోఃక్షోభ తో వైద్యము పొందుతున్నాడు.
- యువత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ , టాబ్స్, టెలిగ్రామ్, వాట్సప్ మొదలైన సోషల్ మీడియాలపై ఆధారపడటం లేదా బానిసలుగా మారడం మరియు తదనంతరం మానవ సంబంధ భాంధవ్యాల రాహిత్య సమస్యలలో చిక్కుకుకపోవడం మరియు పరి పరి విధాలుగా (ఆర్థికంగాను, వ్యక్తిత్వ మరియు సామాజిక పరంగాను ) మోసపోవడము సర్వసాధారణమైంది. ఇలా చాలా మంది తమ వద్ద చికిత్స పొందుతూనే ఉన్నారు. అవసరమైనంత వరకు మాత్రమే టెక్నాలజీ వాడితే బాగుంటుందని ఈ సందర్భంగా డా. రమేష్ బాబు సూచించారు.