మంత్రి ఫరూక్ నిరాడంబరత…
1 min readపూలదండలు, బొకేలు, శాలువలు తేవద్దు
విద్యార్థులకు అవసరమయ్యే సామాగ్రిని తీసుకురండి
నూతన సంవత్సర స్వాగతానికి పిలుపునిచ్చిన మంత్రి ఫరూక్
పల్లెవెలుగు వెబ్ అమరావతి : రాష్ట్రంలో హంగు ఆర్భాటాలు లేకుండా నిరాడంబర తత్వంతో రాజకీయాల్లో ఉన్న అతి కొద్ది మందిలో ముందు వరసలో ఉండే నాయకుడు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో వివిధ మంత్రి పదవులు, శాసన మండలి చైర్మన్ గా ఉన్న సమయంలో కూడా తనకు 2+2 గన్ మెన్ల భద్రత అవసరం లేదని వెనక్కి పంపిన ప్రజా ప్రతినిధిగా, పోలీసు ఉన్నతాధికారుల విధి నిర్వహణ ఒత్తిడి మేరకు కేవలం ఒక్క గన్ మెన్ చాలు అoటూ నిరాడంబరత చాటుకున్న వ్యక్తిగా ఎన్ఎండి ఫరూక్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే 2025 ఆంగ్ల నామ నూతన సంవత్సర వేడుకల స్వాగతానికి తన వద్దకు వచ్చే నాయకులు, అనుచరులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికార యంత్రాంగానికి నిరాడంబరత్వం తో కూడిన ఫరూక్ ఇచ్చిన ఓ పిలుపు ఆకర్షిస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా నంద్యాలలో మంత్రి క్యాంపు కార్యాలయానికి వద్దకు వచ్చి తనకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చేవారంతా ఖర్చుతో కూడుకున్న పూలదండలు, బొకేలు, ఖరీదైన స్వీట్లు, పండ్లు, శాలువలు తీసుకురావద్దని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. వీటిల్లో ఏ ఒక్కటి,రెండు తెచ్చినా రూ. 500 నుంచి రూ. 1000 కి మించి ఒక్కొక్కరికి ఖర్చు అవుతుందని, కేవలం నిమిషాల వ్యవధిలో దండలు బొకేలు ఇలాంటివన్నీ నేలపాలు కావడం, ఖర్చు వృధా తప్ప, ఎలాంటి ఉపయోగము లేదని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. పూలదండలు, బొకేలు లాంటి వాటిని తన వద్దకు తేవద్దని అందుకు ప్రతిగా తెచ్చే స్థోమత కలిగిన వారంతా విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు, పెన్నులు, పరీక్షల ప్యాడ్లు, స్కెచ్ పెన్నుల సెట్లు, పెన్సిల్లు, రబ్బర్లు లాంటివి డజన్లు డజన్లు గా సెట్లుగా తీసుకువస్తే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఆర్థిక స్థోమత కలిగిన వారు కంప్యూటర్లు అందజేస్తే పేద విద్యార్థులకు అండగా నిలిచిన వారవుతారని, కొత్త సంవత్సరం వేళ దుబారా ఖర్చులకు పోరాదని మంత్రి ఫరూక్ సూచించారు.
జనవరి 1న టపాసులు పూర్తిగా నిషేధం
జనవరి 1న నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయం రాజ్ థియేటర్ వద్ద టపాకాయలు కాల్చవద్దని టిడిపి నాయకులు, కార్యకర్తలు, అనుచరులకు సూచించారు. భారత మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాపదినాల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం మొదటి రోజున క్యాంపు కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చడం, కేకులు కట్ చేసే కార్యక్రమాలు, పూలదండలు శాలువాలు తో సన్మానాలు పూర్తిగా చేయరాదని నిర్ణయించారు.