రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమానికి మంత్రి పార్థసారథి శ్రీకారం
1 min readరూ.76 కోట్లతో పనులు ప్రారంభo
మరో రూ.46 కోట్లతో 28 శాశ్వత పనులు మంజూరు
సంక్రాంతి లోపు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తికి చర్యలు
రోడ్లు బాగుంటేనే అభివృద్ధి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దెందులూరు మండలం గోపాన్నపాలెం లో రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి శ్రీకారం చుట్టారు.రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి రహదారులు గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం వద్ద జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డు వెళ్లే రోడ్డుకు సంబంధించి గుంతలు లేని రోడ్ నెట్వర్క్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి మంత్రి పార్థసారథి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.600 కోట్ల పైగా నిధులు కేటాయించి ఆర్ అండ్ బి రహదారులను గుంతలు లేని రహదారులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ పనులు అన్నిటిని సంక్రాంతి లోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదన్నారు. ఏలూరు జిల్లాలో రూ 76 కోట్లతో రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు అదే విధంగా మరో రూ 46 కోట్లతో 28 శాశ్వత పనులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రహదారుల అభివృద్ధి ద్వారా అభివృద్ధి సాధ్యమని తద్వారా పరిశ్రమలు కూడా వస్తాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ప్రస్తుత రోడ్లు ఈ దుస్థితికి రావడానికి గత పాలకులే కారణమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు తమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఈ పనులను జనవరి 15 లోపు పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి స్పష్టం చేశారని, అదేవిధంగా జనవరి తర్వాత ముఖ్యమంత్రి వారి పర్యటనలో ఎక్కడైనా గుంతలతో కూడిన రహదారి కనబడితే సంబంధిత ఇంజనీరు పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారని మంత్రి పార్థసారథి తెలిపారు. సంస్కృతి, నాగరికత ఆ ప్రాంత రోడ్ల అభివృద్ధి ద్వారానే కనబడుతుంది అన్నారు. గత ప్రభుత్వం బాధ్యతారాహిత్య పాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో 5 అత్యంత ప్రాజెక్టులో ఒకటిగా చింతలపూడి ప్రాజెక్టును తీసుకురావడం గర్వించదగ్గ విషయం అన్నారు చింతలపూడి ప్రాజెక్టును కూడా పూర్తిచేసి ప్రజల సహకారాన్ని నిజం చేస్తామన్నారు. స్థానిక శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలిపిన నిరుపయోగంగా అటవీ భూమిలో జీడి ఇతర పంటల సాగుకు ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేసి ఈ అంశాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధిని కళ్ళకు కనిపించేల అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గానికి ఏలూరు-జంగారెడ్డిగూడెం రోడ్డు గుండెకాయ వంటిదని, అటువంటి రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గోపన్నపాలెం వద్ద ఈ రహదారిని విస్తరించి, అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దెందులూరు-పంగిడిగూడెం, కొత్తూరు-పెరికేడు రోడ్లను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. గోపన్నపాలెం- రామసింగవరం అభివృద్ధికి త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు చేపడుతున్నామని చెప్పారు. అయితే ఈ రోడ్లకు సమాంతరంగా డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం కల్పించాలని, ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి కొలుసు పార్థసారథికి కోరారు. రామసింగవరం వద్ద ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెందిన భూమి 1500 ఎకరాలు నిరుపయోగంగా ఉందని, ఈ భూమిలో డ్వాక్రా మహిళలకు అర ఎకరం చొప్పున లీజు విధానంపై అందించి జీడీ మొక్కలు, ఇతర ఉద్యానవన పంటలు సాగుచేసేందుకు అనుమతించేందుకు చర్యలు తీసుకుని, దీనికి ఒక ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. గతంలో నిర్మించిన పశువుల షెడ్లు పనులకు సంబంధించి విజిలెన్సు తనిఖీ చేసి, వారికి సక్రమమైతే వాటికి బిల్లులు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, రహదారులు,భవనాల శాఖ ఎస్ఈ జాన్ మోషే, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, తహసీల్దార్ సుమతి, ఎంపిడిఓ శ్రీదేవి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్, స్థానిక నాయకులు మిల్లుబాబు, తదితరులు పాల్గొన్నారు.