ప్రజలు, ప్రభుత్వం పరస్పర అంగీకారంతో రోడ్ల విస్తరణ.. మంత్రి టి.జి భరత్
1 min readఆర్.అండ్.బి శాఖ అధికారులతో ట్రాఫిక్ నియంత్రణపై మంత్రి సమీక్ష
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజలు, ప్రభుత్వం పరస్పర అంగీకారంతో నగరంలో రోడ్ల విస్తరణ చేపట్టనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. కర్నూలు నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అతిథిగృహంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులతో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్‌పై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన సర్కిల్ అయిన రాజ్ విహార్‌లో ట్రాఫిక్ కష్టాలు తీవ్రంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం ఆనంద్ థియేటర్ ఎదురుగా ఉన్న హంద్రి బ్రిడ్జి వద్ద నుండి వాహనాలు మళ్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైతే ఫ్లై ఓవర్, అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించేందుకు స్టడీ చేయాలన్నారు. దీంతోపాటు రాజ్‌విహార్ జంక్షన్‌ను విస్తరించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. కోర్టు భవనాలతో పాటు జడ్జిల నివాసాలు ఏ స్థితిలో ఉన్నాయో పరిశీలించి అవసరమైన మరమ్మత్తులు వెంటనే చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా పరిశీలించి మరమ్మతులు చేయాలన్నారు. ఇక చిల్డ్రన్స్ పార్క్ నుండి వడ్డెగేరి, ఉస్మానియా కాలేజీ మీదుగా బుధవారపేట, కలెక్టరేట్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలన్నారు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు, దుకాణాదారులతో మాట్లాడి తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రజలు, ప్రభుత్వం పరస్పర అంగీకారంతో నగరంలో రోడ్డు విస్తరణ జరగాలని ఆదేశించారు. దీంతోపాటు కర్నూలు నుండి కల్లూరుకు వెళ్లే మార్గంలో ఉన్న వక్కెర వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు స్టడీ చేయాలన్నారు. బళ్లారి చౌరస్తా వద్ద ట్రాఫిక్ నియంత్రణకు హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలను ఎస్.ఏ.పీ క్యాంపులో వచ్చే విధంగా పరిశీలించాలని మంత్రి టి.జి భరత్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు వేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్.అండ్.బి ఎస్.ఈ ఎస్.ఈ నాగరాజు, ఈఈలు సురేష్ బాబు, క్రిష్ణారెడ్డి, డి.ఈలు నాగరాజు, శివరుద్ర, రవిచంద్ర, వెంకటేశ్వర్లు, ఫణిరామ్, సుజాత, రుక్మిణి, తదితర అధికారులు పాల్గొన్నారు.