బడేటి బుజ్జి జ్ఞాపకార్థంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే బడేటి చంటి
1 min readశాంతివనం పునరుద్ధరణకు చర్యలు
స్వచ్ఛంద సంస్థలకు చేయూతనివ్వాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా ప్రజోపయోగ కార్యక్రయాలకు చేయూతనందించాల్సిన ప్రజాప్రతినిధులు కేవలం కక్షసాధింపు చర్యగా ప్రజలకు ఉపయోగపడే వాటిని విధ్వంసం చేయడం ప్రజాగ్రహానికి గురిచేస్తుందన్న వాస్తవాన్ని గుర్తించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉన్నత ఆశయంతో ముందుకు వచ్చే స్వచ్ఛంధ సంస్థలకు చేయూతనందించాలి కానీ వారిని ఇబ్బందుల పాలు చేసి తద్వారా ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన పేర్కొన్నారు. ఏలూరు అశోక్ నగర్ బ్రిడ్జి వద్ద ఉన్న శాంతివనం శ్మశాన వాటికను శనివారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. ఈ శాంతివనంలో ప్రజలకు ఉపయోగపడేరీతిలో ప్లాష్ స్వచ్ఛంధ సంస్థ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్లాష్ స్వచ్ఛంధ సంస్థపై కన్నెర్రజేసిన మాజీ ప్రజాప్రతినిధి ప్రజలకు ఉపయోగపడే కట్టడాలను కార్పొరేషన్ అధికారులతో కూల్చివేయించారు. అప్పటినుంచి ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. కాగా శనివారం శ్మశానవాటికను పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి పూర్తి వివరాలను ప్లాష్ టీంను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆవరణలో మొక్కలు నాటి టీ గార్డ్స్ ఏర్పాటుచేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దాదాపు వంద సంవత్సరాల చరిత్రగల శ్మశానవాటికలో 20 సంవత్సరాల క్రితం ప్లాష్ స్వచ్చంధ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దిందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్లాష్ సంస్థ నిర్వాహకులు యర్రంశెట్టి శ్రీనివాస్ దాతల సహకారంతో ఈ శ్మశానవాటికను అందరికీ ఉపయోగంలో ఉండేలా తీర్చిదిద్దారన్నారు. శ్మశాన వాటిక ఆవరణలో శవ పేటికలు, వాహనాలు అందుబాటులో ఉంచి, ఎవరు ఫోన్ చేసినా వారికి పంపేవిధంగా చర్యలు తీసుకున్నారన్నారు. అయితే 2022 నవంబర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి మాజీ ప్రజాప్రతినిధి హాజరైయ్యారని, ఆ సమయంలో తనకు అవమానం జరిగిందని మనసులో పెట్టుకున్న ఆయన కక్షసాధింపు చర్యగా కార్పొరేషన్ అధికారులను పంపి, శ్మశాన వాటిక ఆవరణలో ఉన్న షెడ్డును కూల్చివేయడంతో పాటు శవపేటికలు, వాహనాలకు నష్టం చేకూర్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు చేయూతనందించాలి తప్పా ఈ విధంగా తన స్వార్థ ప్రయోజనం కోసం సంస్థను నష్టపరచాలని అనుకుంటూ ప్రజలకు ఇబ్బందులు సృష్టించడం భావ్యం కాదన్న విషయం మాజీ ప్రజాప్రతినిధి విస్మరించడం బాధాకరమన్నారు. ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలను ప్రోత్సహించాలి తప్పా వారికి నష్టం జరిగే విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. భవిష్యత్ లో ఇటువంటి వాటికి ఎవరూ పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, శాంతివనాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విధ్వంసం విషయం సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిందని, వారుకూడా విస్మయం వ్యక్తం చేశారని చెప్పారు. శాంతివనం పునరుద్ధరణకు వారు కూడా పూర్తి సహకారం అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.