టీజీ భరత్ అనే నేను..
1 min readమొదటిసారి ఎమ్మెల్యే..
- మంత్రిగా ప్రమాణ స్వీకారం…
- లైవ్లో తిలకించిన కుటుంబీకులు, ప్రజలు
- అభివృద్ధిలో కర్నూలును టాప్లో ఉంచుతానని హామీ…
- సంబరాలు చేసుకుంటున్న కర్నూలువాసులు
- సీఎం చంద్రబాబు నాయుడు, టీజీ భరత్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన అభిమానులు
కర్నూలు, పల్లెవెలుగు:యువకిశోరం.. ప్రముఖ పారిశ్రామిక వేత్త, అశేష ప్రజాదరణ పొందిన కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రుల సమక్షంలో రాష్ట్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిన టీజీ భరత్… తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ కంచుకోటలో.. ఎవరూ ఊహించని రీతిలో మెజార్టీ రావడంపై కర్నూలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా…. మొదటిసారే సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్లో చోటు దక్కించుకోవడంతో అభిమానులు, కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండాపోయింది.
కర్నూలును అభివృద్ధి చేస్తా…
రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు అభివృద్ధిలో వెనుకబడి ఉందని, రానున్న రెండేళ్లలో కర్నూలును సుందరవనంగా తీర్చిదిద్దుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు మంత్రి టీజీ భరత్. ఏపీలోనే కర్నూలును టాప్ లో ఉంచుతానని వెల్లడించారు. : టిజిబి యూత్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన తాను… మున్ముందు ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత సేవ చేస్తానని పేర్కొన్నారు. మంత్రిగా అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
సంబరాల్లో… కర్నూలువాసులు
కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని లైవ్లో తిలకించిన ప్రజలు, కుటుంబీకులు, అభిమానులు, కార్యకర్తలు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద సంబరాలు చేసుకున్నారు. ప్రజలకు స్వీట్లు పంచారు. పాత బస్తీలో ర్యాలీగా వెళ్లి పెద్ద సంఖ్యలో బాణ సంచా పేల్చారు. పదవిలో లేనప్పుడే ఎన్నో సేవలు చేసి.. ప్రజా మన్ననలు పొందిన టీజీ భరత్… మంత్రిగా భవిష్యత్లో అత్యత్తమ సేవలు అందించి.. మరెన్నో పదవులు పొందాలని కర్నూలు ప్రజలు ఆకాంక్షించారు.
బయోడేటా…
నియోజకవర్గం : కర్నూలు
టీడీపీ ఎమ్మెల్యే : టిజి భరత్
తండ్రి : టిజి వెంకటేష్
తల్లి : టిజి రాజ్యలక్ష్మి
పుట్టిన తేది : 05.08.1976
కుటుంబం : టిజి శిల్ప (భార్య), టిజి విభూ(కుమారుడు), శ్రీ ఆర్య(కుమార్తె), సోదరి జ్యోష్ణ, మరో సోదరి మౌర్య,
విద్యఅర్హతలు : ఎంబిఏ(యూకే)
నేటివ్: కర్నూలు
వృత్తి : పారిశ్రామికవేత్త, సీఎండి , శ్రీరాయలసీమ హై స్ట్రేంగ్త్, హైపో లిమిటెడ్ కంపెనీ
రాజకీయ నేపథ్యం: తండ్రి టిజి వెంకటేష్ రెండు సార్లు కర్నూలు ఎమ్మెల్యేగా, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి, రాజ్యసభ సభ్యునిగా పని చేసారు.
సేవకార్యక్రమాలు : టిజిబి యూత్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు