PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెండో రోజూ  నారా లోకేష్ “ప్రజాదర్బార్”

1 min read

యువనేతను కలిసి సమస్యలు విన్నవించిన మంగళగిరి ప్రజలు

పల్లెవెలుగు వెబ్ అమరావతి:  మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చిన విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండో రోజూ “ప్రజాదర్బార్” నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసంలో యువనేత స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. “ప్రజాదర్బార్” కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. పెద్దఎత్తున తరలివచ్చి తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. డీఎస్సీ-2008, జీవో నెం.39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2,193 మందిని రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువనేతను కలిసి విన్నవించారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కాలేజీ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. నులకపేట ఎంపీయూపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు యువనేత దష్టికి తీసుకువచ్చారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల తన మేనల్లుడికి వైద్యసాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా కోరారు. డిగ్రీ, ఎంబీయే పూర్తిచేసిన తనకు, తన సోదరికి ఉద్యోగాలు కల్పించాలని తాడేపల్లికి చెందిన కే.కిరణ్ బాబు, కే.మౌనిక విజ్ఞప్తి చేశారు. వికలాంగుడినైన తనకు 40 ఏళ్లు వచ్చినా ఉద్యోగం రాలేదని, గత ప్రభుత్వంలో నష్టపోయానని, జీవనోపాధి కల్పించాలని తాడేపల్లికి చెందిన బి.శ్రీనివాసరావు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. శాశ్వత నివాసం లేనందున తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని వడ్డేశ్వరం రాధారంగా నగర్ కు చెందిన యర్రంశెట్టి సీతారాములు, బొంతల మారుతీ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అంగన్ వాడీ హెల్పర్ గా పనిచేస్తున్న తనకు ధర్నా చేశామనే నెపంతో గత ప్రభుత్వం ప్రమోషన్ నిలిపివేసిందని, ఇప్పించాలని ఉండవల్లికి చెందిన కొలనుకొండ రాజేశ్వరి లోకేష్ ను కలిసి కోరారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగం కల్పించాలని మంగళగిరికి చెందిన పెదపూడి మర్తమ్మ విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను విన్న లోకేష్.. పరిష్కారానికి కృషిచేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.

About Author