PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోవాలి 

1 min read

-పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎంఎస్ భారతి 

 పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : ఈనెల 14వ తేదీన  జరిగే జాతీయ లోకాదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎంఎస్ భారతి తెలిపారు. మంగళవారం పత్తికొండ కోర్టు లోని మండల న్యాయ సేవాధికార కార్యాలయంలో   ఆమె మాట్లాడుతూ…. దేశంలోని వివిధ కోర్టులలో పెండింగులో ఉన్న కేసులను దృష్టిలో పెట్టుకొని భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) 1987 సంవత్సరంలో జాతీయ లోక్ అదాలత్  ఏర్పాటు చేసిందన్నారు.   ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో పెండింగ్ లో ఉన్న కేసులను మరియు కోర్టులో వ్యాజ్యానికి ముందు దశలో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. చాలా రోజుల నుండి ఉన్న ఆస్తి తగాదాలు, ప్రొనోట్, చెక్ బౌన్స్ తో పాటు పెండింగ్ లో ఉన్న సివిల్ కేసులను పరిష్కరించుకోవచ్చని వివరించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో చాలా కేసులు పరిష్కారానికి వచ్చాయని తెలిపారు. రాజీ అయ్యే క్రిమినల్ కేసులు కూడా ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చు అని అన్నారు. పత్తికొండ కోర్టులో దాదాపు రెండు వేలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. కేసుల పరిష్కారానికి రాజీమార్గమే….రాజ మార్గమని, కాక్షిదారులు లోక్అదాలత్ ని సద్వినియోగం  చేసుకోవాలని సూచించారు. లోక్అదాలత్ గురించి పూర్తి సమాచారం కోసం కక్షిదారులు న్యాయవాదులను లేదా పోలీస్ స్టేషన్ లో పోలీసులను సంప్రదించి తెలుసుకోవచ్చని తెలిపారు.

About Author