ఊపిరితిత్తుల సమస్యలకు సరికొత్త చికిత్సలు
1 min read* అందుబాటులో ఆధునిక వైద్య విధానాలు
* కొత్త మందులతో మరింతగా రోగులకు ఊరట
* కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో లంగ్స్ టాక్ సదస్సు
* రాయలసీమ జిల్లాల నుంచి పలువురు వైద్యుల హాజరు
* పీజీ విద్యార్థులు, కొత్త వైద్యులకు అనుభవపూర్వక శిక్షణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఊపిరితిత్తుల సమస్యలు చిన్నవయసు వారి నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా రావచ్చని, సాధారణ ఆస్థమా నుంచి టీబీ, సీఓపీడీ లాంటి అనేక రకాల సమస్యలు వీటిలో ఉంటాయని వైద్య ప్రముఖులు అన్నారు. కర్నూలు కిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో లంగ్స్ టాక్ పేరుతో ఒక రోజు కంటిన్యువస్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమం ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి, కర్నూలు కిమ్స్ ఆస్పత్రుల సహకారంతో కర్నూలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. వివిధ రకాల ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించి కొత్తగా వస్తున్న చికిత్స పద్ధతులు, అత్యాధునిక వైద్య విధానాలు, సరికొత్తగా వస్తున్న మందులు, వాటితో రోగులకు ఎలా ఊరట లభిస్తుందన్న విషయాలను ప్రధానంగా ఈ సదస్సులో చర్చించారు. కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ జి.సుధాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ క్లినికల్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ శుభకర్ నాదెళ్ల, ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీలుగా కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పల్మనాలజిస్టు డాక్టర్ వెంకట చలమయ్య, కర్నూలు కిమ్స్ సవీర అనంతపురం ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పల్మనాలజిస్టు డాక్టర్ యశోవర్ధన్ వ్యవహరించారు. కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి, అనంతపురం, బళ్లారి, రాయచూరు, హైదరాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల నుంచి పలువురు వైద్య నిపుణులు హాజరై జూనియర్ వైద్యులు, పీజీ విద్యార్థులకు పలు రకాల చికిత్సా పద్ధతుల గురించి అవగాహన కల్పించారు. సుమారు 150 మంది వరకు జూనియర్ వైద్యులు, పీజీ విద్యార్థులు ఈ సదస్సుకు వచ్చి కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఈ సదస్సులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కర్నూలు ప్రెసిడెంట్ డా. కె. రామచంద్ర నాయుడు, వైస్ ప్రెసిడెంట్ ఎస్. వెంకట్ రమణ, ట్రెసరర్ డా. కె. మాధవి శ్యామల, కర్నూలు డి ఎం & హెచ్ ఓ డా. ఎల్ భాస్కర్, మరియు డా. జి. శారదా పాల్గొన్నారు. ఈ సదస్సును ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని కిమ్స్ కర్నూలు సి ఓ ఓ డా. సునీల్ తెలిపారు.ఇందులో ప్రధానంగా.. చిన్న వయసు నుంచి కొంతమందికి వచ్చే ఆస్థమా నివారణకు గతంలో వాడే మందులు ఇప్పుడు అస్సలు ఉపయోగంలో లేవని.. కొత్తగా వస్తున్న మందులు సమర్థంగా పనిచేస్తున్నందున వాటిపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. టీబీ గుర్తింపు, దానికి సత్వర చికిత్స, అలాగే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) లాంటి సమస్యలకు ఎలా చికిత్స చేయాలన్న విషయాలను కూడా వివరించారు. టీబీ రాకుండా కొన్నిరకాల టీకాలు కూడా వస్తున్నాయంటూ వాటి గురించి తెలిపారు. ఇంకా, ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కొపీ, రిజిడ్ బ్రాంకోస్కొపీ, థొరాకోస్కొపీ, సెమీ రిజిడ్ థొరాకోస్కొపీ లాంటి వైద్య విధానాలు, వాటిలో ఉపయోగించే అత్యాధునిక పరికరాలు, వాటిని వాడే విధానం, వాటివల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. పెద్ద పెద్ద నగరాల్లో ఇవన్నీ ఇప్పటికే ఉపయోగంలో ఉన్నా, ద్వితీయశ్రేణి నగరాల్లో మాత్రం ఇంకా వీటిని ఉపయోగించడంలో అంత నైపుణ్యం అందరికీ రావట్లేదని.. అందువల్ల ఇలాంటి సీఎంఈ సదస్సుల ద్వారా ఈ అత్యాధునిక పరికరాల ఉపయోగం గురించి తెలుసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న రోగులకు మంచి చికిత్సలు అందించడానికి వీలుంటుందని చెప్పారు. కొత్త పరికరాలను ఉపయోగించే పద్ధతి మొత్తాన్ని ప్రొసీజరల్ శిక్షణ కూడా మధ్యాహ్నం ఇచ్చారు. ఆస్థమాలో ఉపయోగించే బయోలాజికల్స్ మార్కెట్‌లోకి కొత్తగా ఏవేం వచ్చాయి, ప్రయోగాల్లో ఏవేం ఉన్నాయి, మార్కెట్లోకి ఎప్పుడు రావచ్చనే విషయాల గురించి అవగాహన కల్పించారు. ఇప్పుడు ఉన్నవాటికంటే మెరుగైన ఇన్‌హేలర్లు కూడా ప్రయోగాల్లో ఉన్నాయని, నెబోలిజిమాబ్, బెండాలిజిమాబ్ లాంటి కొత్త మందుల వల్ల కలిగే ఉపయోగాలు తెలిపారు.